ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి పోలీసుల నోటీసులు.. అసలేం జరిగిందంటే..?

By Rajesh KarampooriFirst Published Jan 20, 2023, 5:47 AM IST
Highlights

హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. 41 ఏ సీఆర్పీసీ కింద గురువారం మంగళ్ హాట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్ కు మంగళ్ హాట్ పోలీసులు ఇచ్చారు. 

హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి పోలీసులు నోటీసులు జారీచేశారు. గురువారం నాడు 41ఏ సీఆర్పీసీ కింద మంగళ్‌హాట్‌ పోలీసులు నోటీసులు అందించారు. గతేడాది ఆగస్టులో అజ్మీర్‌ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు కంచన్‌బాగ్‌ పోలీస్‌స్టేషన్‌లో రాజాసింగ్‌పై కేసు నమోదు అయింది. అనంతరం ఆ కేసును కంచన్‌బాగ్‌ నుంచి మంగళ్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌కు పోలీసులు బదిలీచేశారు.  ఈ నేపథ్యంలో రాజాసింగ్ కు మంగళ్‌హాట్‌ పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. అజ్మీర్ దర్గాపై అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. 

ఈ నోటీసులపై రాజాసింగ్ తరపు న్యాయవాది కరుణ సాగర్ స్పందించారు. పోలీసులు జారీ చేసిన నోటీసులకు సమాధానం ఇస్తామన్నారు. ఫేస్ బుక్ లో నెటిజన్ పెట్టిన పోస్టు కింద రాజాసింగ్ కామెంట్ చేశారు. అయితే ఆయన చేసిన కామెంట్ ఓ మతాన్ని కించపరిచినట్లుగా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలోనూ రాజాసింగ్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. 

వివాదాస్పద వీడియో

హైదరాబాద్‌లో మునావర్ ఫారుఖీ అనే స్టాండప్ కమెడియన్ షో అనుమతి ఇవ్వడంపై రాజాసింగ్ పోరాటం చేశారు. మునావర్ ఫారుఖీ  హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ప్రవర్తించారని ఆరోపించారు. ఆయన షోను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కానీ.. షో యధావిధిగా నడిచింది. ఈ దీనికి కౌంటర్‌గా రాజాసింగ్.. ఓ వర్గాన్ని కించపరిచే విధంగా వీడియో చేసి యూట్యూబ్‌లో పెట్టారు. దీంతో ఆ విషయం వివాదాస్పదంగా మారింది. దీంతో పోలీసులు మొదట కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అనంతరం రాజాసింగ్ పై  పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించారు. 

గత ఏడాది  ఆగస్టు 25న రాజాసింగ్‌పై పీడీయాక్ట్ నమోదు చేశారు. అనంతరం ఆయను జైలు తరలించారు. ఈ ఘటనను వ్యతిరేకిస్తూ.. రాజాసింగ్ భార్య హైకోర్టులో పిటిషన్ వేశారు. తన భర్తపై అక్రమంగా కేసు నమోదు చేశారనీ, ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఆయనపై పీడీ  యాక్ట్‌ను క్వాష్ చేస్తూ గతంలో నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో పలు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేశారు. మీడియాతో మాట్లాడటం, ర్యాలీల్లో పాల్గొనడం.. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని స్పష్టం చేసింది.  సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని హైకోర్టు షరతు విధించింది. 

click me!