ఎల్లుండి నుంచి హైదరాబాద్ మెట్రో పరుగులు: నిబంధనలు ఇవీ...

By Siva KodatiFirst Published Sep 5, 2020, 4:31 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం సోమవారం నుంచి మెట్రో సేవలు ప్రారంభిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం సోమవారం నుంచి మెట్రో సేవలు ప్రారంభిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన తొలుత ఎల్బీ నగర్- మియాపూర్ మార్గంలో మెట్రోను ప్రారంభించి తర్వాత దశల వారీగా మూడు కారిడార్లలోనూ సేవలు పునరుద్ధరిస్తామని తెలిపారు.

8వ తేదీ నుంచి నాగోల్- రాయదుర్గం, 9 నుంచి జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే సర్వీసులు నడుస్తాయని రెడ్డి చెప్పారు.

కరోనా లక్షణాలు లేని వారిని మాత్రమే రైలులోకి అనుమతిస్తామని ఆయన పేర్కొన్నారు. సాధారణ ఉష్ణోగ్రతలు ఉంటేనే మెట్రోలో ప్రయాణించాలని ఎండీ సూచించారు.

మెట్రో సిబ్బందికి పీపీఈ కిట్లు అందజేస్తామన్న ఆయన స్మార్ట్ కార్డులు, నగదు రహిత విధానంలోనే టికెట్లు జారీ చేస్తామని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. మెట్రో స్టేషన్లు, రైళ్లలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటామని, స్టేషన‌లలోనే ఐసోలేషన్ రూంలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

అలాగే కంటైన్మెంట్ జోన్లుగా ఉన్న గాంధీ ఆసుపత్రి, భరత్ నగర్, మూసాపేట్, ముషీరాబాద్, యూసఫ్‌గూడా మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు ఎండీ చెప్పారు. ప్రయాణికులు వీలైనంత తక్కువ లగేజీతోనే ప్రయాణించాలని ఎన్వీఎస్ రెడ్డి సూచించారు. 

click me!