ఎన్టీఆర్ పై పాఠం: కేసీఆర్ కు బాలకృష్ణ థ్యాంక్స్,, విషయం ఇదీ...

By team teluguFirst Published Sep 5, 2020, 1:37 PM IST
Highlights

నందమూరి తారక రామారావు గారి గురించి భావి తరాలకి స్ఫూర్తినిచ్చేలా 10వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకం లో పాఠ్యాంశముగా చేర్చిన తెలంగాణా ప్రభుత్వానికి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు....అని బాలకృష్ణ రాసుకొచ్చారు. 

నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. తెలంగాణ పదవతరగతి పాఠ్యాంశాల్లో నందమూరి తారక రామ రావు గారి గురించిన ప్రస్తావన ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్ గురించి పాఠ్యాంశాల్లో చేర్చినందుకు ధన్యవాదాలు అని రాసుకొచ్చారు బాలకృష్ణ. 

"కళకి, కళాకారులకి విలువను పెంచిన కధానాయకుడు, తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పీఠాన్ని కదలించేలా వినిపించిన మహానాయకుడు, ఎన్నో సాహసోపేతమైన ప్రజారంజక నిర్ణయాలతో ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజానాయకుడు, మదరాసీయులమనే పేరుని చెరిపి భారతదేశపటంలో తెలుగువాడికి, తెలుగు వేడికి ఒక ప్రత్యేకతని తెచ్చిన తెలుగుజాతి ముద్దు బిడ్డ ,అన్నగారు, మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారి గురించి భావి తరాలకి స్ఫూర్తినిచ్చేలా 10వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకం లో పాఠ్యాంశముగా చేర్చిన తెలంగాణా ప్రభుత్వానికి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు...." అని బాలకృష్ణ రాసుకొచ్చారు. 

దీనిపై తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ స్పందిస్తూ... అది ఎన్టీఆర్ మీద పెట్టిన చాప్టర్ కాదు అని తేల్చి చెప్పారు. ఆయన కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ... "పదవ తరగతి సాంఘిక శాస్త్రంలో రెండో భాగంలో సమకాలీన ప్రపంచం, భారత దేశం అనే అంశం కింద ఉన్న పద్దెనిమిదో పాఠం -1977-2000 మధ్య కాలానికి సంబంధించిన రాజకీయ ధోరణుల ఆవిర్భావం సంబంధించిన 17 పేజీల లెసన్లో ఉన్న ఒకే ఒక్క పేరాగ్రాఫ్. ఈ పాఠంలో దేశంలో అన్ని ప్రధాన రాజకీయ ఉద్యమాల, నాయకుల ప్రస్తావన ఉంది. ఈ పాఠం కొత్తది కూడా కాదు. బాలయ్య నిన్న కళ్ళు తెరిచి ట్వీట్ వేయడంతో చాలా మంది మిత్రులు స్పందిస్తున్నారు. అందుకే ఈ పోస్టు.అని రాసుకొచ్చారు. 

బాలకృష్ణ ఎన్టీఆర్ పై పెట్టిన పాఠం విషయంలో కేసీఆర్ కి ధన్యవాదాలు తెలపడంతో ఎన్టీఆర్ పై పాఠమా అంటూ తీవ్ర దుమారం చెలరేగింది. అది పాఠం కాదని, రాజకీయ ధోరణుల్లో టీడీపీ స్థాపన అంశం ప్రస్తావని అని ప్రభుత్వం, వివరణ ఇచ్చుకోవలిసి వచ్చింది. 

click me!