హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో : చాంద్రాయణగుట్టకు మహర్దశ.. ఇంటర్‌చేంజ్ స్టేషన్ ఇక్కడే

By Siva Kodati  |  First Published Jan 9, 2024, 4:30 PM IST

రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు గత ప్రభుత్వం ప్రారంభించిన ఎయిర్‌పోర్ట్ మెట్రోను రద్దు చేసిన రేవంత్ సర్కార్.. పాతబస్తీ మీదుగా కనెక్టివిటీ పెంచాలని యోచిస్తోంది. ఇది కార్యరూపం దాలిస్తే చాంద్రాయణగుట్టలో ఎయిర్‌పోర్ట్ ఇంటర్‌ఛేంజ్ స్టేషన్ రానుంది. 


హైదరాబాద్ మెట్రోను నగరం నలువైపులా విస్తరింపజేయాలని సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగానే పగ్గాలు అందుకున్న వెంటనే మెట్రోపై దృష్టి పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు గత ప్రభుత్వం ప్రారంభించిన ఎయిర్‌పోర్ట్ మెట్రోను రద్దు చేసిన రేవంత్ సర్కార్.. పాతబస్తీ మీదుగా కనెక్టివిటీ పెంచాలని యోచిస్తోంది. రాయదుర్గం నుంచి కాకుండా ఓల్డ్ సిటీ నుంచి విమానాశ్రయం వరకు మెట్రో విస్తరించాలని సీఎం ఆదేశించారు. 

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మెట్రో అధికారులు, నిపుణులు సమీక్ష నిర్వహించారు. హెచ్ఎంఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఈ భేటీలో కొత్త మార్గాల్లో సవాళ్లు, సంక్లిష్టతలు , సాధ్యమయ్యే సాంకేతిక పరిష్కారాలపై చర్చించారు. ప్రస్తుతం నాగోల్ - ఎల్బీనగర్ - మైలార్‌దేవ్‌పల్లి - శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు ఓ రూట్ ప్రతిపాదన దశలో వుంది. అలాగే నాగోల్ - ఎల్బీనగర్ - మైలార్‌దేవ్‌పల్లి - ఆరాంఘర్ - కొత్త హైకోర్టుకు అనుసంధానంగా మరో మార్గం వుంది. దీనిలో ఏ మార్గాన్ని ఎంపిక చేయాలనే దానిపై అధికారులు చర్చించారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కి.మీ మార్గాన్ని చాంద్రాయణగుట్ట వరకు మరో 1.5 కి.మీ పొడిగిస్తే ఎయిర్‌పోర్ట్ మెట్రోకి లింక్ అవుతుంది. 

Latest Videos

undefined

ఇది కార్యరూపం దాలిస్తే చాంద్రాయణగుట్టలో ఎయిర్‌పోర్ట్ ఇంటర్‌ఛేంజ్ స్టేషన్ రానుంది. ఇక్కడ ఇరుకైన రోడ్డు, ఫ్లై ఓవర్ వుండటంతో మెట్రో రైల్ రివర్సింగ్, స్టేబ్లింగ్ లైన్ల ఏర్పాటు చేసే విషయంలో ఇబ్బందులపై చర్చించారు. అలాగే మెట్రో సెకండ్ ఫేజ్ కోసం కొత్త డిపోలు, ఆపరేషన్ కంట్రోల్ సెంటర్స్ (ఓసీసీ) ఏర్పాటు చేసే ప్రదేశాలు, మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు భూమార్గం మీదుగా మెట్రో నిర్మాణం సాధ్యాసాధ్యాలపై చర్చించారు.

అనంతరం ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని మిగిలిన మెట్రోల్లో అనుసరిస్తున్న వివిధ పద్ధతులను అధ్యయనం చేయాల్సిందిగా ఆదేశించారు. కొత్త మెట్రో మార్గంలో పార్కింగ్ , బస్సులు, ఇతర రవాణా వ్యవస్థలతో అనుసంధానం , లగేజ్ కోసం ఖాళీ ప్రదేశాలపై డీపీఆర్ ఇవ్వాలని ఎన్వీఎస్ రెడ్డి సూచించారు. 

click me!