ఒకే రోజు వెయ్యి మందికి అన్నదానం: హైదరాబాద్ యువకుడి రికార్డ్

By Siva KodatiFirst Published May 27, 2019, 1:43 PM IST
Highlights

ఆకలితో అలమటిస్తున్న వారికి పట్టెడన్నం పెడితే వచ్చే సంతృప్తే వేరు. అందుకే అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అన్నారు పెద్దలు. అలాగే అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం అని కూడా చెబుతారు.

ఆకలితో అలమటిస్తున్న వారికి పట్టెడన్నం పెడితే వచ్చే సంతృప్తే వేరు. అందుకే అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అన్నారు పెద్దలు. అలాగే అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం అని కూడా చెబుతారు.

అందుకే చాలా మంది పుట్టినరోజులు, ఇతర శుభకార్యాల సందర్భంగా అన్నదానాలు చేస్తుంటారు. అయితే సాధారణ రోజుల్లో అన్నదానం చేయడం వేరు. అలాంటిది ఒక యువకుడు ఒకే రోజు వెయ్యి మందికి అన్నదానం చేసి ప్రపంచ రికార్డు సాధించాడు.

హైదరాబాద్‌కు చెందిన గౌతమ్ కుమార్ అనే కుర్రాడు. ‘‘సర్వ్ నీడీ’’ అనే స్వచ్ఛంద సంస్ధను ఏర్పాటు చేశాడు. ఈ ఎన్‌జీవో సాయంతో ఆపదంలో ఉన్న వారిని ఆదుకుంటూ ఉంటాడు. తాజాగా ఆదివారం ఒకే రోజు నగరంలోని వేరు వేరు ప్రాంతాల్లో దాదాపు 1000 మందికి భోజనం పెట్టి రికార్డు సాధించాడు.

ముందుగా సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాడు గౌతమ్. అనంతరం రాజేంద్రనగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో నిర్వహించి.. చివరిగా చౌటుప్పల్‌లోని అమ్మానాన్న అనాథాశ్రమంలో అన్నదానం చేశాడు.

తద్వారా ఒకే రోజు వెయ్యి మందికి అన్నదానం చేసి యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. దీనిపై యూనివర్సల్ రికార్డ్స్ ఇండియా ప్రతినిధులు సర్టిఫికేట్ అందజేశారు.

దీనిపై గౌతమ్ కుమార్ మాట్లాడుతూ.. సర్వ్ నీడీ సంస్థను 2014లో ప్రారంభించానని, అప్పుడు తాను ఒక్కడినే అన్ని పనులు చూసుకునేవాడినని.. అయితే ఇప్పుడు 140 మంది వాలంటీర్లు తనకు సహకరిస్తున్నారని వెల్లడించాడు.

2014 నుంచి సామాజిక సేవ చేస్తున్నామని.. అయితే ఆదివారం మాత్రం ఒకే రోజు వెయ్యి మంది ఆకలి తీర్చి యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌‌లో స్థానం సాధించామని గౌతమ్ తెలిపాడు.

తమ సంస్థ ఉన్నంత కాలం ఏ ఒక్కరూ ఆకలితో చావకూడదని.. అదే తమ నినాదమని అందుకోసం తాము పనిచేస్తున్నామన్నాడు. ప్రభుత్వం, దాతలు, ఇతర సంస్థలు తమకు సహాయం చేస్తే ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని గౌతమ్ స్పష్టం చేశారు.
 

click me!