ప్రేమిస్తున్నా.. అనగానే సంబరపడిన వృద్ధుడు: నిండా ముంచిన యువతి

By Siva KodatiFirst Published May 27, 2019, 12:29 PM IST
Highlights

ఉద్యోగ బాధ్యతల నుంచి రిటైర్ అయి జీవితంలో చివరి దశలో ఉన్న ఒక వృద్ధుడిని ఓ యువతి ప్రేమ పేరుతో మోసం చేసింది. అతని నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి మాయమైంది

ఉద్యోగ బాధ్యతల నుంచి రిటైర్ అయి జీవితంలో చివరి దశలో ఉన్న ఒక వృద్ధుడిని ఓ యువతి ప్రేమ పేరుతో మోసం చేసింది. అతని నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి మాయమైంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నిజాంపేటకు చెందిన ఓ 68 ఏళ్ల వ్యక్తి.. బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు.

ఈ క్రమంలో ఫేస్‌బుక్‌లో ఆయనకు ఏంజెలా డొనాల్డ్ అనే విదేశీ యువతితో స్నేహం ఏర్పడింది. వీరిద్దరూ రోజు గంటల తరబడి చాటింగ్ చేసేవారు. ఈ క్రమంలో ఫోటోల్లో మీరు ఎంతో అందంగా ఉన్నారు.. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటూ సదరు యువతి మెసేజ్ పెట్టింది.

తన ప్రేమకు గుర్తుగా తన దగ్గరున్న రూ. 10 కోట్లు బహుమతిగా పంపుతున్నానని నమ్మించింది. దీంతో నగదు తీసుకోవడానికి సదరు వ్యక్తి అంగీకరించాడు. ఈ క్రమంలో ఈ నెల 18న అతనికి రోహిత్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు..

ఏంజెలా డొనాల్డ్ అనే మహిళ నుంచి తనకు పార్శిల్ వచ్చిందని, ప్రస్తుతం ముంబై ఎయిర్‌పోర్టులో ఉందని.. అది ఇంటి అడ్రస్‌కు పంపించాలంటే బీమా చార్జీలు రూ.65,800 చెల్లించాలని చెప్పి బ్యాంక్ ఖాతా నెంబర్ తెలిపాడు. దీంతో అతను చెప్పిన విధంగా వృద్ధుడు ఆ మొత్తాన్ని డిపాజిట్ చేశాడు.

మరుసటి రోజు మళ్లీ ఫోన్ చేసిన రోహిత్ ‘‘కస్టమ్స్ క్లియరెన్స్ కోసం మరో రూ.2.35 లక్షలు నగదు చెల్లిస్తే.. పార్శిల్ మీ ఇంటికి వస్తుందని నమ్మించాడు. దీంతో మరోసారి రూ.2.35 లక్షలను వృద్ధుడు రోహిత్ ఖాతాలో వేశాడు.

ఈ క్రమంలో ఆర్‌బీఐ పేరుతో ఈ నెల 21న అతడికి మరో మెయిల్ వచ్చింది. మెయిల్‌లో పేర్కొన్న లింక్‌ను క్లిక్ చేసి అకౌంట్ తెరవాలని.. రూ. 10 కోట్లు ఖాతాలో పడతాయనేది మెయిల్ సారాంశం.

అకౌంట్ తెరిచి రోజులు గడుస్తున్నా డబ్బులు జమ కాలేదు.. దీంతో మోసపోయానని గ్రహించిన వృద్ధుడు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఐపీసీ సెక్షన్ 417, 4719, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

click me!