రిటైరయ్యాక కూడా చదువుపై తగ్గని అభిరుచి.. 74 ఏళ్ల వయసులో ఇంటర్ పూర్తి చేసిన హైదరాబాద్ వాసి..

By Sumanth KanukulaFirst Published May 31, 2023, 11:49 AM IST
Highlights

ఏజ్‌ జస్ట్ నెంబర్ మాత్రమేనని చాలా మంది అంటుంటారు. వయసుకు, ఏదైనా నేర్చుకోవడానికి సంబంధం లేదని పలువురు నిరూపిస్తూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ వ్యక్తి 74 ఏళ్ల వయసులో ఇంటర్ పూర్తి చేశారు.

హైదరాబాద్‌:  ఏజ్‌ జస్ట్ నెంబర్ మాత్రమేనని చాలా మంది అంటుంటారు. వయసుకు, ఏదైనా నేర్చుకోవడానికి సంబంధం లేదని.. కృష్టి, పట్టుదల ఉంటే జీవితంలో సాధించలేనిది ఏదీ లేదని పలువురు నిరూపిస్తూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ వ్యక్తి 74 ఏళ్ల వయసులో ఇంటర్ పూర్తి చేశారు. తన ఉద్యోగం నుంచి రిటైర్ వయసు పైబడిందనే ఆలోచనను పక్కనబెట్టి.. తన కలను సాకారం చేసుకున్నారు. ఇప్పుడు డిగ్రీ కూడా పూర్తి చేయాలనే ఉత్సాహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే దోస్త్‌ ద్వారా డిగ్రీ అడ్మిషన్ పొందేందుకు సిద్దమయ్యారు. అయితే నిబంధల ప్రకారం ఆయన వయసు కటాఫ్ పరిమితిని మించిపోయినప్పటికీ.. అతని అభిరుచి చూసి ఆశ్చర్యపోయిన అధికారులు.. అడ్మిషన్ పొందేందుకు సహకరిస్తామని చెప్పారు. ఆయన డిగ్రీలో.. చరిత్ర, రాజకీయ శాస్త్రం, ఆర్థిక శాస్త్రంలో బీఏ పూర్తి చేయాలనుకుంటున్నారు.

వివరాలు.. కల్లా నాగ్‌శెట్టి హైదరాబాద్‌లో ఉప్పుగూడ శివాజీనగర్‌ నివాసి. ఆయన బీదర్‌ జిల్లాలో 1949లో జన్మించారు. నాగ్‌శెట్టి కన్నడ మాధ్యమంలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ(పదో తరగతి)లో ఉత్తీర్ణుడయ్యారు. అయితే ఆయన కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉన్నత విద్యను కొనసాగించలేకపోయారు. ఉద్యోగం కోసం ప్రయత్నాల్లో భాగంగా ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి హాజరయ్యారు. అక్కడ సిపాయి ఉద్యోగం పొందారు. భారత సైన్యంలో పనిచేసి కార్గిల్ సెక్టార్‌లో 1971లో భారత్-పాకిస్థాన్ యుద్ధంలో పాల్గొన్నారు. 21 సంవత్సరాలు సైన్యంలో పనిచేసిన తర్వాత జూనియర్ కమిషనర్ అధికారిగా పదవీ విరమణ చేశారు. మరో 21 సంవత్సరాలు అతను ప్రైవేట్ సంస్థల్లో సెక్యూరిటీ అధికారిగా పనిచేశాడు.

అయితే ఇంత చేస్తున్న చదవుపై మాత్రం ఆసక్తి పోలేదు. రిటైర్ అయ్యాక ఎలాగైనా ఇన్ని దశాబ్దాలుగా తన అభిరుచిని పెంపొందించుకుని, అతను చదువును కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఐఎస్ సదన్‌లోని ఓ ఇంటర్మీడియట్ కళాశాలలో చేరారు. ఆయన రెగ్యులర్ అభ్యర్థిగా పరీక్షలకు హాజరయ్యేందుకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు నుండి ప్రత్యేక అనుమతి పొందారు. సీఈసీ‌లో 764 మార్కులు సాధించి ఇంటర్‌ పాస్ అయ్యారు. ఇక, డిగ్రీ పూర్తి చేయాలనే అభిరుచితో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారులకు కూడా ఆయన ఒక ప్రాతినిధ్యాన్ని సమర్పించారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించారు. దోస్త్ పోర్టల్‌లో అడ్మిషన్ల కోసం పుట్టిన తేదీకి అవసరమైన మార్పులు చేస్తామని తనకు విద్యా మండలి అధికారులు హామీ ఇచ్చినట్టుగా నాగ్‌శెట్టి తెలిపారు. 

click me!