బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పై హైద్రాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ విషయమై పల్లవి ప్రశాంత్ కు పోలీసులు నోటీసులు పంపారు.
హైదరాబాద్: బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కు హైద్రాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారంనాడు నోటీసులు ఇచ్చారు.ఈ నెల 17న అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ఘర్షణ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 147, 148, 149, 427, 290 , 353 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.ఈ నేపథ్యంలో పోలీసులు ఇవాళ పల్లవి ప్రశాంత్ కు నోటీసులు పంపారు.
ఈ నెల 17వ తేదీన అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ఘర్షణ విషయమై పల్లవి ప్రశాంత్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ ఘర్షణ సమయంలో పల్లవి ప్రశాంత్ వ్యవహరించిన తీరును కూడ పోలీసులు తప్పుబడుతున్నారు. ఘర్షణను నివారించే విధంగా కాకుండా ప్రశాంత్ వ్యవహరించిన తీరు ఘర్షణను మరింత పెంచేదిగా ఉందని పోలీస్ ఉన్నతాధికారులు అభిప్రాయంతో ఉన్నారు.
అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ఘర్షణ మరింత పెద్దది కావడానికి పల్లవి ప్రశాంత్ వ్యవహరశైలి కూడ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నెల 17వ తేదీన బిగ్ బాస్ విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచారు. ఈ సమయంలో అన్నపూర్ణ స్టూడియో వద్ద పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ అభిమానులు పెద్ద ఎత్తున చేరారు. ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సమయంలోనే స్టూడియోలో కార్యక్రమం ముగించుకొని బయటకు వచ్చిన అమర్ దీప్ కారుపై పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడికి దిగారు. ఈ సమయంలో అమర్ దీప్ భార్య, తల్లి కూడ కారులోనే ఉన్నారు. ఈ దాడితో అమర్ దీప్ కుటుంబసభ్యులు భయాందోళనలు వ్యక్తం చేశారు.
అన్నపూర్ణ స్టూడియో పరిసర ప్రాంతాల్లోని ప్రైవేట్, ఆర్టీసీ బస్సులపై కూడ దాడులకు దిగారు.ఆర్టీసీ బస్సులపై దాడులను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ గా తీసుకున్నారు. ఆర్టీసీ బస్సులపై దాడిని సమాజంపై దాడిగా పేర్కొన్నారు. అభిమానం పేరుతో కేసుల్లో ఇరుక్కోవద్దని సజ్జనార్ సూచించారు.