తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వెంటనే ఎన్నికల హామీలను నెరవేరుస్తుంటే ప్రజల్లోనే కొన్ని వర్గాలనుండి వ్యతిరేకత ఎదురవుతోంది. మహాలక్ష్మీ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆటో డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు.
హైదరాబాద్ : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తుంటారు... కానీ తెలంగాణలో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చినవెంటనే నెరవేస్తుంటూ వద్దనే డిమాండ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురయ్యింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ఆటో, ఇతర ప్యాసింజర్ వాహనాల డ్రైవర్లు రేవంత్ సర్కార్ ను కోరుతున్నారు. కొన్నిచోట్ల అయితే ఆటో డ్రైవర్లు ఆందోళనబాట పట్టారు. ఇలా తాజాగా హైదరాబాద్ లో భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్వంలో ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు.
ఆటో డ్రైవర్లంతా భారీ ర్యాలీగా హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్డులోని బస్ భవన్ వద్దకు చేరుకున్నారు. మహిళలకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల తమకు గిరాకీలు లేకుండా పోయాయని... ఆదాయం లేక కుటుంబాలు పస్తులుండే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్త చేసారు. కాబట్టి వెంటనే 'మహాలక్ష్మి' పథకాన్ని నిలిపివేయాలని ఆటోడ్రైవర్లు డిమాండ్ చేసారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం బస్ భవన్ ను ముట్టడించిన ఆటో డ్రైవర్లు లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు.
బిఎంఎస్ నాయకులతో కలిసి ఆటో కార్మికులు బస్ భవన్ లోపలికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆర్టిసి అధికారులకు వినతిపత్రం ఇచ్చివస్తామన్నా పోలీసులు లోపలికి పంపించకపోవడంతో ఆందోళనకారులు ఆగ్రహించారు. ఒక్కసారిగా బస్ భవన్ లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం, తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Also Read కర్ణాటకలో సిద్దరామయ్య చేతులెత్తేసాడు... రేపు రేవంత్ ఇంతేనా? : కేటీఆర్
కేవలం హైదరాబాద్ లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆందోళనలు చేపట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంవల్ల తాము ఉపాధి కోల్పోయే పరిస్థితి వస్తోందని... ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అంటున్నారు. ఇలా ఆర్టిసి బస్టాండ్స్ వద్ద ఆటో డ్రైవర్లు ఆందోళనలు చేపడుతున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమకు న్యాయం చేస్తుందని నమ్మామని... అందువల్లే ఆ పార్టీకి మద్దతుగా నిలిచి గెలిపించుకున్నామని ఆటో డ్రైవర్లు అంటున్నారు. కానీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచితంగానే ఆర్టిసి బస్సుల్లో ప్రయాణించే సదుపాయం కల్పించి తమ కడుపు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ బాధను అర్థంచేసుకోవాలని... మహిళలకు ఫ్రీ జర్నీ స్కీమ్ ను రద్దుచేయాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు.