హైదరాబాద్‌లో గోల్డ్ ఏటీఎం.. బంగారం విత్ డ్రా చేసుకోవచ్చు.. దేశంలోనే తొలిసారిగా..

By Sumanth KanukulaFirst Published Dec 4, 2022, 5:08 PM IST
Highlights

తెలంగాణలోని హైదరాబాద్‌లో దేశంలోనే తొలిసారిగా గోల్డ్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. బేగంపేటలో అందుబాటులోకి వచ్చిన ఈ గోల్డ్ ఏటీఎం నుంచి బంగారం విత్ డ్రా  చేసుకోవచ్చు.

తెలంగాణలోని హైదరాబాద్‌లో దేశంలోనే తొలిసారిగా గోల్డ్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. బేగంపేటలో అందుబాటులోకి వచ్చిన ఈ గోల్డ్ ఏటీఎం నుంచి బంగారం విత్ డ్రా  చేసుకోవచ్చు. ‘గోల్డ్‌ సిక్కా’ కంపెనీ ఆధ్వర్యంలో బేగంపేటలోని అశోక్ రఘుపతి ఛాంబర్స్‌లో ఈ ఏటీఎం ప్రారంభించబడింది. గోల్డ్ ఏటీఎం సెంటర్‌ను తెలంగాణ మహిళా కమిషన్‌ చైర్మన్‌ సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు. వినియోగదారులు తమ డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఏటీఎం నుంచి స్వచ్ఛమైన బంగారు నాణెలను కొనుగోలు చేయవచ్చు. అలాగే గోల్డ్ సిక్కా సంస్థ జారీచేసే ప్రీపెయిడ్ కార్డులను కూడా వినియోగించవచ్చు.

కస్టమర్లు 0.5 నుంచి 100 గ్రాముల బంగారు నాణేలను కొనుగోలు చేయవచ్చని గోల్డ్ సిక్కా సంస్థ ప్రతినిధులు తెలిపారు. వాటి స్వచ్ఛత, బరువును ధృవీకరించే ధృవీకరణ పత్రాన్ని పొందవచ్చని చెప్పారు. బంగారం ధరలు ఏటీఎం స్క్రీన్‌పై కనిపిస్తాయని తెలిపారు. 

గోల్డ్ ఏటీఎం ద్వారా 99.99 శాతం నాణ్యత కలిగిన 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల బంగారు నాణేలను విత్ డ్రా చేసుకోవచ్చని చెప్పారు. భారత్‌లో గోల్డ్ మార్కెట్ వేళలకు అనుగుణంగా ఉదయం 9.50 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఏటీఎంల ద్వారా గోల్డ్ తీసుకోవచ్చని తెలిపారు. హైదరాబాద్‌లోని గుల్జార్‌హౌస్‌, సికింద్రాబాద్‌, అబిడ్స్‌తోపాటు పెద్దపల్లి, కరీంనగర్‌, వరంగల్‌లో గోల్డ్‌ ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

click me!