నేడే తీగల వంతెన ప్రారంభం.. భారీ ఏర్పాట్లు

By telugu news teamFirst Published Sep 25, 2020, 8:17 AM IST
Highlights

జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ వైపు నుంచి సిగ్నల్‌ చిక్కులు లేని ప్రయాణం కోసం దుర్గం చెరువు, రోడ్‌ నెంబర్‌ -45లో వంతెన నిర్మిస్తున్నారు. రూ.184 కోట్లతో దుర్గం చెరువుపై, రూ.150 కోట్లతో రోడ్‌ నెంబర్‌-45లో వంతెనల పనులు పూర్తయ్యాయి. 

హైదరాబాద్ నగరవాసులు ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. నగరంలో ఏర్పాటు చేసిన తీగల వంతెన నేడు ప్రారంభం కానుంది. ఇప్పటికే దీని ప్రారంభం పలుమార్లు వాయిదా పడగా.. ఎట్టకేలకు శుక్రవారం దీనిని ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారికంగా ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు ఈ వంతెనను ప్రారంభించనున్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, డిప్యుటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, వీ శ్రీనివాస్ గౌడ్, మేయర్ బొంతు రామ్మెహన్, ఎంపీలు కే కేశవరావు, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, దానం నాగేందర్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ లు హాజరుకానున్నారు.

జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ వైపు నుంచి సిగ్నల్‌ చిక్కులు లేని ప్రయాణం కోసం దుర్గం చెరువు, రోడ్‌ నెంబర్‌ -45లో వంతెన నిర్మిస్తున్నారు. రూ.184 కోట్లతో దుర్గం చెరువుపై, రూ.150 కోట్లతో రోడ్‌ నెంబర్‌-45లో వంతెనల పనులు పూర్తయ్యాయి. జంట వంతెనలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. రోడ్‌ నెంబర్‌-45 నుంచి ఐటీ కారిడార్‌కు సులువైన ప్రయాణానికి అవకాశం కలగనుంది. కేటీఆర్‌ వంతెన పనులపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు పర్యాటక హంగులు అద్దేందుకు కీలక సూచనలు చేశారు.

కాగా.. ఈ వంతెన మొత్తం పొడవు 735.639 మీటర్లు, కేబుల్ పొడవు 425.85 మీటర్లు కాగా.. అప్రోచ్ వయా డక్ట్ పొడవు 309.789 మీటర్లు, నాలుగు లేన్లు ఏర్పాటు చేశారు. ఈ వంతెన ప్రారంభమైతే.. నగరంలో ట్రాఫిక్ సమస్యకు పులిస్టాప్ పడే అవకాశం ఉంది. 

click me!