దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించిన కేటీఆర్: వంతెన పేరు ఏంటంటే..?

By Siva KodatiFirst Published Sep 25, 2020, 8:32 PM IST
Highlights

హైదరాబాద్ దుర్గం చెరువు సరస్సు పై నిర్మించిన అత్యాధునిక , అత్యధిక శక్తివంతమైన తీగల ఆధారిత వంతెనను తెలంగాణ పురపాలక , పట్టణాభివృద్ధి, శాఖా మంత్రి కె.టి.రామా రావు శుక్రవారం ప్రారంభించారు. 

హైదరాబాద్ దుర్గం చెరువు సరస్సు పై నిర్మించిన అత్యాధునిక , అత్యధిక శక్తివంతమైన తీగల ఆధారిత వంతెనను తెలంగాణ పురపాలక , పట్టణాభివృద్ధి, శాఖా మంత్రి కె.టి.రామా రావు శుక్రవారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 184 కోట్ల రూపాయల వ్యయంతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు.

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45 నుంచి దుర్గం చెరువు కేబుల్‌బ్రిడ్జిని చేరుకునేందుకు నిర్మించిన ఎలివేటెడ్‌ కారిడార్‌ను కూడా కేటీఆర్ ప్రారంభించారు. దీనికి ‘పెద్దమ్మతల్లి ఎక్స్‌ప్రెస్‌ వే’గా పేరు పెట్టారు

వంతెన ప్రారంభాన్ని పురస్కరించుకొని శనివారం సాయంత్రం 5.30 గంటలకు ఆర్మీ సెరమోనియల్ మరియు సింఫోనీ బ్యాండ్ ను ఇండియన్ ఆర్మీ ద్వారా ప్రదర్శిస్తారని పురపాలక, పట్టణఅభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరు పాల్గొని లైవ్ బ్యాండ్ ప్రదర్శనను తిలకించాలని ఆయన కోరారు. 

ఈ వారాంతంలో వంతెన పై వాహనాల రాకపోకలను క్రమబద్దీకరించి వేరొక వైపు వున్న క్యారేజ్ వే ద్వారా ప్రజలు ఈ ప్రదర్శనను తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నామని అర్వింద్ తెలియజేశారు.

అత్యంత సుందరమైన లైటింగ్ , సరస్సు  బ్యాక్ డ్రాఫ్ ద్వారా బ్యాండ్ ప్రదర్శన ప్రజల మనసులలో చిరస్థాయిలో నిలచిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న భారతీయ సైనికులు , జి.హెచ్.యం.సి శానిటేషన్ కరోనా వారియర్ల సేవలకు సంఘీభావాన్ని తెలియజేసేలా బ్యాండ్ ప్రదర్శన ఉంటుందని అర్వింద్ తెలిపారు.

ఈ ఐకానిక్ వంతెనను పాపులరైజ్ చేయడానికి ఆర్మీ సింఫోనీ బ్యాండ్ తీగల వంతెన పై 45 నిమిషాల పాటు ప్రదర్శన ఇస్తారని ఆయన తెలిపారు. “వందేమాతరం” తో ప్రారంభించి పలు దేశ భక్తి , భారతీయ , పాశ్చాత్య గీతాలు ప్రదర్శించి “జయ హో ”  తో ముగిస్తారని అర్వింద్ వెల్లడించారు. 

click me!