మహేష్ కో ఆపరేటివ్ బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్ కేసులో రెండు నెలలు విచారణ జరిపినట్టుగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ కేసు పురోగతికి సంబంధించిన వివరాలను ఆయన బుధవారం మీడియాకు వెల్లడించారు. పట్టుదలతో ఈ కేసును చేధించినట్టుగా చెప్పారు. ఏ కేసుకు ఖర్చు కానీ డబ్బులు.. మహేష్ బ్యాంకు కేసు విచారణకు అయిందని చెప్పారు. టీఏ, డీఏ కలిపి ఈ కేసు దర్యాప్తుకు రూ. 58 లక్షలు ఖర్చయ్యాయని తెలిపారు. మహేష్ బ్యాంక్ సర్వర్‌లో లోపాలు ఉన్నాయని తెలిపారు. సర్వర్‌లో లోపాలను ఆసరా చేసుకుని నగదు బదిలీ చేసుకున్నారని చెప్పారు. సర్వర్ పకడ్బందీగా నిర్వహించడంలో మహేష్ బ్యాంక్ విఫలం అయిందన్నారు. సైబర్ నేరగాళ్లు 2 నెలల ముందే ఖాతాలు నిర్వహించారని అన్నారు.
మహేష్ బ్యాంకు ఉద్యోగులకు సైబర్ నేరగాళ్లు ఫిషింగ్ మెయిల్స్ పంపించారని చెప్పారు. 200 మంది ఉద్యోగులకు మెయిల్స్ పంపించగా.. ఇద్దరు మాత్రమే క్లిక్ చేశారని చెప్పారు. దీంతో హ్యాకింగ్ సులవు అయిందని తెలిపారు. జనవరి 23న సర్వర్ హ్యాక్ చేసి 4 ఖాతాల్లోకి నగదు నిల్వలను పెంచేశారని చెప్పారు. ఆ ఖాతాల నుంచి పలు బ్యాంక్‌లలోని 115 ఖాతాలకు డబ్బులు బదిలీ చేశారని.. ఆ ఖాతాల నుంచి మరో 398 ఖాతాలకు నగదు బదిలీ చేశారని తెలిపారు. సైబర్ నేరగాళ్లు ప్రాక్సీ ఐపీలు ఉపయోగించారని చెప్పారు. ఒక ఐపీ స్విట్జర్లాండ్, మరొకటి కెనడాలో చూపిస్తోందన్నారు. సైబర్ సెక్యూరిటీ కోసం పెద్ద బ్యాంకులు రూ. వేల కోట్లు ఖర్చు చేస్తాయని చెప్పారు.
ప్రధాన హ్యాకర్ దేశంలో లేడని తెలిపారు. స్టీఫెన్ ఒర్జీ సెకండ్ లెవల్ హ్యాకర్‌ను అరెస్ట్ చేశామని చెప్పారు. స్టీఫెన్ నైజరీయన్‌లో ప్రధాన నిందితుడికి కీలక సమాచారం చేరవేశారని తెలిపారు. 100 మంది పోలీస్ ఆఫీసర్లతో కేసు విచారణ చేశామని తెలిపారు. ఈ హ్యాకింగ్ కేసులో మొత్తం 23 మందిని అరెస్ట్ చేసినట్టుగా చెప్పారు. అరెస్ట్ అయినవారిలో నలుగురు నైజీరియన్లు ఉన్నారని తెలిపారు. ప్రధాన హ్యాకర్‌ను అరెస్ట్ చేసేందుకు.. ఇంటర్ పోల్‌ను ఆశ్రయించి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తామని చెప్పారు.
ఇంట్రా సాఫ్ట్ కంపెనీ మహేష్ బ్యాంక్‌కు సాఫ్ట్‌వేర్ ఇస్తున్నారని.. చాలా బ్యాంకులకు వీరు సాఫ్ట్‌వేర్ అందజేస్తున్నారని చెప్పారు. కానీ సరైన సైబర్ సెక్యూరిటీ లేకుండా వీరు సాఫ్ట్‌వేర్ అందిస్తున్నారని అన్నారు. ఈ కేసులో కనీస సమాచారం కూడా ఇంట్రా సాఫ్ట్ కంపెనీ ఇవ్వడం లేదన్నారు.
మహేష్ బ్యాంక్ సింగిల్ నెట్‌వర్క్‌తో నడిపిస్తున్నారని.. బ్యాంక్ వ్యవస్థలో ఒకే నెట్‌వర్క్ వాడకూడదని చెప్పారు. హ్యాకింగ్ అనేది ఆందోళన కలిగించే అంశంగా చూడాలన్నారు. ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం వహించడం తగదని అన్నారు. ప్రజల సొమ్ముతో బ్యాంక్‌లను నడుపుతున్నా కూడా నిబంధనలు పాటించక పోవడం, నిర్లక్ష్యం చేయడంతోనే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
ఇక, మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ (Mahesh Cooperative Bank) సర్వర్‌లను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ. 12.90 కోట్లను కొట్టేశారు. ఆ మొత్తాన్ని ఇతర ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. మహేశ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం సర్వర్‌లోకి చొరబడిన సైబర్ నేరగాళ్లు ఈ నేరానికి పాల్పడ్డారు.