రాత్రి సమయంలో డయల్ 100కు కాల్ చేసిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.. ఎందుకోసమంటే..

By Sumanth KanukulaFirst Published Jul 31, 2022, 11:14 AM IST
Highlights

హైదరాబాద్ నగరంలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్వయంగా డయల్ 100కు ఫోన్ చేశారు. 

హైదరాబాద్ నగరంలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్వయంగా డయల్ 100కు ఫోన్ చేశారు. వివరాలు.. శుక్రవారం రాత్రి సమయంలో డయల్ 100‌కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి.. తన ఇంటికి సమీపంలోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ వైపు నుంచి పెద్ద ఎత్తున శబ్దాలు వస్తున్నాయని పేర్కొన్నారు. కంట్రోల్​ రూమ్​ సిబ్బంది వివరాలు అడగగా.. కమిషనర్ ఆఫ్‌‌ పోలీస్‌‌ అని చెప్పి ఆయన కాల్ కట్ చేశారు. దీంతో కంట్రోల్ రూమ్ సిబ్బంది తక్షణమే స్పందించారు. వెంటనే ఈ విషయాన్ని జూబ్లీహిల్స్ పోలీసులకు తెలియజేశారు. దీంతో వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. 

రాత్రి విధుల్లో ఉన్న జూబ్లీహిల్స్‌ డీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ చంద్రశేఖర్‌ ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా.. అక్కడ భారీ శబ్దాలు వస్తున్నట్టుగా గుర్తించారు. ఓంనగర్ బస్తీలో తొట్టెల ఊరేగింపు  నేపథ్యంలో పెద్ద ఎత్తున ఊరేగింపు జరుగుతున్నట్టుగా గుర్తించారు. అందులో పాల్గొన్న కొందరు యువకులు.. డప్పులు వాయిస్తూ, టపాసులు పేలుస్తున్నట్టుగా కనుగొన్నారు. నిర్వాహకుడు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిపై 70 బి సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. 

అయితే హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌‌  శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని బోరబండ మీదుగా ఇంటికి  వెళ్తుండగా అక్కడ డీజే సౌండ్​తో న్యూసెన్స్ చేస్తున్న వారిని  గమనించారు. ఈ క్రమంలోనే ఆయన డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. సీపీ ఒక సామాన్యుడిలా డయల్ 100కు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించమని కోరడం పోలీసు వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. 

click me!