జగత్ విఖ్యాత్ రెడ్డి నడిపిన కారులోనే భార్గవ్ రామ్: సీపీ అంజనీకుమార్

By narsimha lodeFirst Published Jan 17, 2021, 4:11 PM IST
Highlights

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఐటీ అధికారులుగా నటించేందుకు 20 మందిని సిద్దార్ధ్ అనే వ్యక్తి పంపాడని హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. 
ఆదివారం నాడు మధ్యాహ్నం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

హైదరాబాద్:బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఐటీ అధికారులుగా నటించేందుకు 20 మందిని సిద్దార్ధ్ అనే వ్యక్తి పంపాడని హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. 
ఆదివారం నాడు మధ్యాహ్నం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

ఈ కిడ్నాప్ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. ఇవాళ మరో 15 మందిని అరెస్ట్ చేసినట్టుగా ఆయన వివరించారు. బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసుకు  మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీనులు ప్లాన్ చేశారని ఆయన చెప్పారు. ఈ నెల 2వ తేదీన లోథా అపార్ట్‌మెంట్ లో, ఈ నెల 4న భార్గవ్ రామ్ కుటుంబం నిర్వహించే స్కూల్ లో కిడ్నాప్ ప్లాన్ చేశారని ఆయన తెలిపారు.

ఐటీ అధికారులుగా నటించేందుకు గాను సిద్దార్ధ్ అనే వ్యక్తిని గుంటూరు శ్రీను కాంటాక్ట్  చేశారని చెప్పారు. 20 మందికి ఒక్క రోజుకు రూ. 25 వేల చొప్పున రూ. 5 లక్షలకు కాంటాక్టు కుదుర్చుకొన్నారని సీపీ తెలిపారు.

గుంటూరు శ్రీనుకు సిద్దార్ధ్ 20 మందిని అప్పగించాడని చెప్పారు. కూకట్‌పల్లిలోని ఓ హోటల్ లో వీరంతా ఉన్నారన్నారు. ఈ 20 మందికి ఐటీ అధికారులుగా దుస్తులను గుంటూరు శ్రీను సమకూర్చాడన్నారు.

ఈ నెల 5వ తేదీన బాల చెన్నయ్య, సంపత్ లు ప్రవీణ్ రావు ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారన్నారు. వీరిచ్చిన సమాచారం మేరకు మూడు వాహనాల్లో ప్రవీణ్ రావు ఇంటికి చేరుకొని కిడ్నాప్ చేశారని సీపీ చెప్పారు.

also read:బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు: మరో 15 మంది అరెస్ట్, మరో 9 మంది కోసం గాలింపు

ఇన్నోవా వాహనం తో పాటు మరో రెండు వాహనాలను నిందితులు ఉపయోగించారని పోలీసులు తెలిపారు. ఈ వాహనాలకు తప్పుడు నెంబర్ ప్లేట్లను ఉపయోగించారని  సీపీ వివరించారు. ఇన్నోవా వాహనం భార్గవ్ రామ్ తల్లి పేరున రిజిస్టరై ఉందన్నారు.మరోవైపు ఈ వాహనాన్ని జగత్ విఖ్యాత్ రెడ్డి నడిపాడని.. ఇదే వాహనంలో భార్గవ్ రామ్ కూడా ఉన్నాడని సీపీ తెలిపారు. 

ప్రవీణ్ రావు తో పాటు ఆయన ఇద్దరు సోదరులను కిడ్నాప్ చేసి మొయినాబాద్ లోని భార్గవ్ రామ్  ఫామ్ హౌస్ కు తీసుకెళ్లారని చెప్పారు. అక్కడే ప్రవీణ్ రావుతో  ఆయన ఇద్దరు సోదరులపై స్టాంప్ పేపర్లపై సంతకాలు తీసుకొన్నారని సీపీ వివరించారు.జగత్ విఖ్యాత్ రెడ్డి, భార్గవ్ రామ్  పేర్లతో ఈ స్టాంప్ పేపర్లను ముందే కొనుగోలు చేశారని  విచారణలో తేలిందని అంజనీకుమార్ చెప్పారు. 
 

click me!