యోగితమ్మా.. ఇదేం మాట ?

Published : Aug 24, 2017, 12:11 PM ISTUpdated : Mar 25, 2018, 11:48 PM IST
యోగితమ్మా.. ఇదేం మాట ?

సారాంశం

హైదరాబాద్ కలెక్టర్ యోగితారాణా వివాదాస్పద కామెంట్స్ ఆదిలాబాద్ జిల్లా వాసుల అభ్యంతరం ఆదిలాబాద్ లో ఫ్యాక్షనిస్టులు, మాఫియా గ్యాంగులు లేవంటూ కామెంట్స్

హైదరాబాద్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన యోగితా రాణా అనతికాలంలోనే వివాదాల్లో చిక్కుకున్నారు. కింది స్థాయి ఉద్యోగులను మందలించే క్రమంలో ఆమె ఉపయోగించిన భాషపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో డైనమిక్ కలెక్టర్ గా విధులు నిర్వర్తించి అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టించిన యోగితా రాణా ఇలా మాట్లాడడమేంటని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఇంతకూ ఆమె మాట్లాడిన మాటలేందో ఒకసారి చూద్దాం.

మంగళవారం సర్వశిక్షా అభియాన్ ఇంజనీరింగ్ పనుల పురోగతిపై ఇంజనీర్లతో కలెక్టర్ యోగితా రాణా సమీక్ష సమావేశం జరిపారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో ఇంజనీరింగ్ పనులు ఆలస్యం కావడం పట్ల ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కుంటి సాకులు చెప్పి పనులు సకాలంలో పూర్తి చేయకపోతే ప్రభుత్వం కేటాయించే నిధులున్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారుతాయి కదా అని ఆమె ఆవేదన చెందారు. దాంతోపాటు నిర్లక్ష్యంగా పనిచేసే ఉద్యోగుల పట్ల తాను కఠినంగానే ఉంటానని హెచ్చిరించారు. అలాగే నిర్లక్ష్యాన్ని వీడి పనులు సకాలంలో పూర్తి చేయాలి. లేదంటే ఆదిలాబాద్ కు బదిలీ చేస్తాను ఏమనుకుంటున్నారో అని ఆమె సీరియస్ అయ్యారు.

ఉద్యోగుల బదిలీలు, అవస్థలు విషయంలో ఎంతటి ఆవేదన ఉంటుందో ఆమెకు తెలిసిందే. ఆమె నిజామాబాద్ లో అధికార పార్టీ నేతల వత్తిళ్లను తట్టుకుని సమర్థవంతంగా పనిచేసిసనందుకు అక్కడి అధికార పార్టీ నేతలు కొందరు, ఇసుక మాఫియా కలిసి ఆమెను బదిలీ చేయించాయన్న ఆరోపణలున్నాయి. అయినప్పటికీ ఆమెకు హైదరాబాద్ లో పోస్టింగ్ ఇచ్చారు. ఇలాంటి సమయంలో ఆదిలాబాద్ కు బదిలీ చేస్తానని ఆమె చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి.

మరోవైపు ఆదిలాబాద్ వాసులు ఆమె వ్యాఖ్యల పట్ల చిన్నబుచ్చుకున్నారు. ఆదిలాబాద్ అంటే భయమా? లేక ఇంకేమైనా అవమానమా? అని ప్రశ్నిస్తున్నారు. ఆదిలాబాద్ లో ఫ్యాక్షనిస్టులు, దాడి దోపిడీ దొంగలు, మాఫియా గ్యాంగులు ఏమాత్రం లేవని ఆదిలాబాద్ జిల్లా వాసి, హైదరాబాద్ లో జర్నలిస్టుగా పనిచేస్తున్న ప్రేమ్ సాగర్ వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్ జిల్లా తెలంగాణకే కాదు ఉమ్మడి రాష్ట్రానికి కూడా ప్రాణవాయువు అందించే అడవుల తల్లి అని గుర్తు పెట్టుకోవాలంటున్నారు.

హైదరాబాద్ లో స్థిరపడిన ఆదిలాబాద్ జిల్లావాసులు మరికొందరైతే మీలాంటి గొప్ప అధికారులు ఆదిలాబాద్ రావాలని మేము కోరుకుంటాం మేడం అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పనిచేయని వాళ్లను ఆదిలాబాద్ పంపితే మా జిల్లాకు ఏం ఫాయిదా అని వారు చెబుతున్నారు.

మొత్తానికి యోగితా రాణా చేసిన కామెంట్ సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చకు కారణమైంది.

 

మరిన్ని తాజా తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొత్త రెండొందల నోటు - రేపు విడుదల

 

PREV
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా