
సివిల్ సర్వీసు అధికారులు వరుసగా రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో జయప్రకాశ్ నారాయణ, జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లో చేరి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇటీవల కాలంలో కూడా తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కొంత కాలం కిందట సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కూడా రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. అనంతరం ఆయనకు పార్టీ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. అయితే తాజాగా మరో ఐఏఎస్ అధికారి కూడా రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ ఆయన ఎవరంటే.. ?
కొంత కాలం నుంచి ఐఏఎస్ ఆఫీసర్ ఎల్.శర్మన్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్టు సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన మరో రెండు నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు. ఉద్యోగం నుంచి విరమణ పొందిన తరువాత ఎల్.శర్మన్ రాజకీయ రంగ ప్రవేశం చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం. ఈ విషయంలో తన సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నాయకులతో, ఇతర నేతలతో చర్చలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో గత కాలం నుంచి సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. రాజకీయ ప్రవేశం కోసం హైదరాబాద్ కు చెందిన ఓ మంత్రి సహకరిస్తున్నారని చెబుతున్నారు. ఆ మంత్రే టీఆర్ఎస్ అధినాయకత్వంతో సంప్రదింపులు చేస్తున్నారని టాక్ నడుస్తోంది.
ఐఏఎస్ ఆఫీసర్ ఎల్.శర్మన్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దాని కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భాగంగా ఉన్న ఖానాపూర్(ఎస్టీ) నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేసి ఎమ్మెల్యే అవ్వాలని భావిస్తున్నారు. ఎల్.శర్మన్ ఉద్యోగ విరమణ చేసిన నాటి నుంచి అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఒక సంవత్సరంన్నర సమయం ఉంటుంది. ఈ సమయంలో తనకు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంటుందని ఆయన అనకుంటున్నారు. అయితే ఆయన ముఖ్యంగా టీఆర్ఎస్ నుంచే పోటీ చేయాలని భావిస్తున్నా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి కూడా బరిలో నిలిచే అవకాశం ఉందని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై హైదరాబాద్ కలెక్టర్ ఎల్.శర్మన్ మీడియాతో మాట్లాడారు. తాను ఉద్యోగం నుంచి విరమణ పొందడానికి ఇంకా రెండు నెలల సమయం ఉందని చెప్పారు. ఆ తరువాతే తన భవిష్యత్ కార్యాచరణ ఏంటనే విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
కాగా.. కొన్ని నెలల కిందట సిద్దిపేట కలెక్టర్ గా ఉన్న వెంకట్రామిరెడ్డి కూడా ఇదే తరహాలో టీఆర్ఎస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భవించి, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం కేసీఆర్ కు ఆయనకు సన్నిహిత్యం ఉంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఆయన తన సర్వీసుకు రాజీనామా చేశారు. అనంతరం వెంటనే టీఆర్ఎస్ లో చేరిపోవడం, ఆయన పేరును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. అనంతరం వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు.