
Bandi Sanjay-Praja Sangram Yatra: తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు బండి సంజయ్ నవంబర్ చివరిలో భైంసా నుండి ఐదవ దశ ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించనున్నారు. నవంబర్ 28 నుంచి తన ప్రజాసంగ్రామ యాత్ర బాసర నుంచి ప్రారంభమై భైంసా మీదుగా కరీంనగర్‌కు వెళ్తుందని సమాచారం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి ఆదిలాబాద్ జిల్లాలోకి యాత్ర ప్రవేశిస్తుందని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.
వివరాల్లోకెళ్తే.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఇదివరకు ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించారు. వివిధ దశల్లో దీనిని ముందుకు కొనసాగించడానికి బీజేపీ ఏర్పాట్లు చేసుకుంది. ఈ క్రమంలోనే ఐదో దశ ప్రజా సంగ్రామ యాత్రను ఈ నెల చివర్లో ప్రారంభించనున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఐదవ దశ ప్రజా సంగ్రామ యాత్రను నవంబర్ 28 న భైంసా నుండి ప్రారంభిస్తారనీ, అక్కడ బహిరంగ సభలో రామారావు పటేల్‌ను పార్టీలోకి చేర్చుకుంటారని పార్టీ సభ్యులు తెలిపారు. కాగా, రామారావు పటేల్ రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. నిర్మల్, ఖానాపూర్, బాదన్‌కుర్తి, కోరుట్ల, జగిత్యాల, చొప్పదండి, కరీంనగర్ రూరల్, కరీంనగర్‌లో 16 రోజుల పాటు బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర తాజా విడతగా సాగుతుందని బీజేపీ నాయకులు తెలిపారు.
హైదరాబాద్‌లో నిర్మల్ బీజేపీ యూనిట్ సభ్యులు, భాజపా నియోజకవర్గ కన్వీనర్ అయ్యన్నగారి భూమన్న, రాష్ట్ర కార్యదర్శి రావుల రాంనాథ్ తదితరులు పాల్గొన్న సమావేశంలో పలు వివరాలు చర్చించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి ఆదిలాబాద్ జిల్లాలోకి యాత్ర ప్రవేశిస్తుందని బీజేపీకి చెందిన రితేష్ రాథోడ్ వెల్లడించినట్టు డెక్కన్ క్రానికల్ నివేదించింది. ఖానాపూర్‌లో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నామనీ, దట్టమైన అటవీ ప్రాంతంలో పర్యటించాల్సి ఉన్నందున నియోజకవర్గంలో ఒకటిన్నర రోజులు గడపవచ్చని రాథోడ్ చెప్పారు.
ఇదిలావుండగా, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదేశానుసారం టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేశారని బండి సంజయ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) క్షమాపణ చెప్పాలని శనివారం డిమాండ్ చేశారు. తన కుమార్తెను రాజకీయంగా అదుపు తప్పకుండా చేయడంతో సహా అన్ని విషయాల్లోనూ కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. శనివారం హైదరాబాద్ లోని అరవింద్ నివాసాన్ని సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడిన బండి సంజయ్.. ఘటనపై కేసీఆర్ స్పదించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసుల సాయంతో టీఆర్‌ఎస్ గూండాలు బీజేపీ ఎంపీ నివాసంపై దాడి చేశారని ఆరోపించారు. దాడిని అడ్డుకోవడంలో విఫలమైన పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న కొందరు పోలీసు అధికారులు యూనిఫారానికి బదులు గులాబీ రంగు దుస్తులు ధరించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘రాజకీయాల్లో భౌతిక దాడుల సంస్కృతి మంచిది కాదు. బీజేపీ కార్యకర్తలు అతిగా ప్రవర్తించినా నేను దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తాను' అని బండి సంజయ్ అన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారనీ, ప్రతిపక్షాలపై కుట్రలు చేయకుండా ఎన్నికల హామీలను నెరవేర్చడంపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని సూచించారు. దాడి విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు సంజయ్ తెలిపారు. బీజేపీ కార్యకర్తలపై టీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న నిరంతర దాడుల గురించి కూడా వివరించామని చెప్పారు.