సైదిరెడ్డికి ఎన్నికల గుర్తు చిక్కులు: అప్పుడు ట్రక్, ఇప్పుడు రోడ్ రోలర్

Published : Oct 05, 2019, 12:12 PM IST
సైదిరెడ్డికి ఎన్నికల గుర్తు చిక్కులు: అప్పుడు ట్రక్, ఇప్పుడు రోడ్ రోలర్

సారాంశం

హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానంలో సార్వత్రిక ఎన్నికల్లో ట్రక్కు గుర్తు బోల్తా పడిన కారుకు ఇప్పుడు రోడ్డు రోలర్ గుర్తు సమస్యగా మారే అవకాశం ఉంది. రోడ్డు రోలర్ గుర్తు టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలుపుపై ప్రభావం చూపుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

హుజూర్ నగర్ : హుజూర్ నగర్ ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణాలో రాజకీయవాతావరణం మంచి కాక మీదుంది. అన్ని ప్రధాన పార్టీలకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారడంతో రాష్ట్ర అగ్ర రాజకీయనేతలంతా హుజూర్ నగర్ లో తిష్ఠ  వేశారు. ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను చిత్తు చేసేందుకు ఎత్తులు వాటికి పైఎత్తులు వేయడంలో తలమునకలైయున్నారు. 

గతసారి ట్రక్ గుర్తు వల్ల ఓడిపోయాము, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసాము, వారు దాన్ని తొలిగించారు ఇక ఏం ప్రాబ్లమ్ లేదు అని తెరాస సంబరపడుతున్న వేళ వారికి ఎన్నికల కమిషన్ కేటాయించిన గుర్తుల వల్ల కొత్త తలనొప్పి మొదలయ్యింది. 

తాజాగా ఎన్నికల కమిషన్ హుజూర్ నగర్ ఉపఎన్నికకు సంబంధించి ఎన్నికల గుర్తులను కేటాయించింది. ఇందులో రోడ్డు రోలరు గుర్తు కూడా ఉంది. ఇదే ఇప్పుడు తెరాస వర్గాల్లో ఆందోళన కలిగిస్తుంది. 

ఈ రోడ్ రోలరు గుర్తు తెరాస కారు గుర్తుకు దగ్గరగా ఉంది. కిరణ్ వంగపల్లి అనే వ్యక్తి కి ఈ రోడ్డు రోలరు గుర్తును కేటాయించారు. ఇతను రిపబ్లిక్ సేన అనే పార్టీ తరుఫున బరిలోకి దిగాడు. 

రోడ్డు రోలరు గుర్తు ఉన్నందుకే తెరాస వాళ్లు ఆందోళనపడుతుంటే మరింత కలవరపరిచే ఇంకో అంశం కూడా ఉంది. అదే సీరియల్ నంబర్లు. తెరాస అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కి ఈవీఎం పైన 4వ నెంబర్ ను ఎన్నికలసంఘం కేటాయించింది. ఈ రోడ్డు రోలరు గుర్తు ఉన్న కిరణ్ కుమార్ క్రమ సంఖ్య 6. అంటే కార్ గుర్తు కిందనే ఈ రోడ్డు రోలరు గుర్తు కూడా ఉంది. ఇది వారిని మరింతగా ఆందోళనకు గురి చేస్తుంది. ఇంకో విషయం ఏమిటంటే, కారు గుర్తు కింద 5వ స్థానంలో ట్రాక్టర్ నడిపే రైతు గుర్తుంది. ఇది కూడా వాహనమే కావడంతో గందరగోళం మరింత పెరిగే ఆస్కారం ఉంది. 

2011 లో వచ్చిన అభ్యర్థనలు మేరకు ఎన్నికల సంఘం ఈ రోడ్డు రోలరు గుర్తును తొలగించింది. మరలా తిరిగి 8 సంవత్సరాల తరువాత ఈ గుర్తును తిరిగి తీసుకొచ్చింది. 

తన ఎలక్షన్ అఫిడవిట్ లో తనకు రోడ్డు రోలరు లేదా ట్రక్కు గుర్తు లేదా మైక్ గుర్తును కేటాయించవలిసిందిగా అభ్యర్థించాడు. ఎన్నికల కమిషన్ ఇతనికి రోడ్డు రోలరు గుర్తును కేటాయించింది. కావాలని కాంగ్రెస్ పార్టీ ఇలాంటి దొంగ రాజకీయాలు చేస్తుందని అధికార తెరాస ఆరోపిస్తుంది. 

ఏది ఏమైనప్పటికీ, ట్రక్కు గుర్తుతోని అప్పుడు తంటాలు పడితే, ఇప్పుడు రోడ్డు రోలరు వల్ల నూతన తంటాలు మొదలయ్యాయి. దీనిని తెరాస ఎలా వ్యూహాత్మకంగా ఎదుర్కుంటుందో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

సజ్జనార్ నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకో: Harish Rao Comments on CP Sajjanar | Asianet News Telugu
Harish Rao Serious Comments: సైబర్ నేరగాళ్లకు రేవంత్ రెడ్డికి తేడా లేదు | Asianet News Telugu