huzurabad Bypoll: టీఆర్ఎస్‌లోకి తీన్మార్ మల్లన్న హుజురాబాద్ కమిటీ సభ్యులు

By telugu teamFirst Published Oct 3, 2021, 8:19 PM IST
Highlights

తీన్మార్ మల్లన్నకు గట్టి షాక్ తగిలింది. ఆయన బీజేపీలోకి వెళ్లబోతున్నట్టు ప్రకటించిన తర్వాత మల్లన్న టీం సభ్యులు టీఆర్ఎస్‌లోకి పెద్ద ఎత్తున చేరారు. మల్లన్న కమిటీ రాష్ట్ర కమిటీ కన్వీనర్ దాసరి భూమయ్య, మరో వంద మంది టీఆర్ఎస్‌లోకి చేరగా, హుజురాబాద్ మల్లన్న కమిటీ సభ్యులు సుమారు 300 మంది గులాబీ కండువా కప్పుకున్నారు.
 

హైదరాబాద్: తీన్మార్ మల్లన్నకు మరో షాక్ తగిలింది. మల్లన్నకు సన్నిహితుడు, తీన్మార్ మల్లన్న కమిటీ రాష్ట్ర కన్వీనర్ దాసరి భూమయ్య, ఆయనతోపాటు సుమారు 100 మంది టీఆర్ఎస్‌లోకి చేరిన సంగతి తెలిసిందే. తాజాగా, హుజురాబాద్‌లోని తీన్మార్ మల్లన్న టీం కమిటీ సభ్యులూ 300మందికిపైగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్‌లోకి చేరారు. మంత్రి హరీశ్ రావు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

రాష్ట్రంలో ప్రధానంగా కేసీఆర్, టీఆర్ఎస్‌ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో విపరీత ప్రాచుర్యం పొందిన తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరబోతున్నట్టు ఇటీవలే ఆయన సతీమణి మమత ప్రకటించారు. ఈ ప్రకటన తీన్మార్ మల్లన్న టీంలో ప్రకంపనలు రేపింది. బీజేపీ పార్టీతో పొసగదని భావించిన వారు టీఆర్ఎస్ వైపు చూశారు. ఈ నేపథ్యంలోనే తీన్మార్ మల్లన్న టీం నుంచి పెద్దమొత్తంలో టీఆర్ఎస్‌లో చేరికలు జరిగాయి.

Latest Videos

హుజురాబాద్ మల్లన్న కమిటీ సభ్యులను పార్టీలోకి ఆహ్వానిస్తూ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. బీజేపీ మతతత్వ పార్టీ అని, దాన్ని ఓడించాలనే లక్ష్యంతోనే వారు టీఆర్ఎస్‌లోకి వస్తున్నారని వివరించారు. కేంద్రంలోని బీజేపీ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నదని, అబద్ధాలతో మభ్య పెడుతున్నదని విమర్శలు గుప్పించారు. పెద్ద నోట్ల రద్దుతో తీవ్ర నష్టం జరిగిందని, సామాన్యుడి ఖాతాలో వేస్తామన్న రూ. 15 లక్షలు ఇంకా జాడకే లేవని అన్నారు.

ఈటల రాజేందర్ లెఫ్టిస్ట్ కదా.. రైటిస్ట్‌గా ఎలా మారారు? బీజేపీలో ఎలా చేరారు? అని ప్రశ్నించారు. ఆయన కేవలం స్వార్థం కోసం కమలం పార్టీలోకి వెళ్లారని విమర్శించారు. బీజేపీ తెలంగాణపై చిన్నచూపు చూస్తున్నదని ఆరోపించారు. వ్యాక్సిన్ ఇస్తలేదని కేంద్రంలోని బీజేపీని విమర్శించిన ఈటల ఇప్పుడెలా ఆ పార్టీ దగ్గరైందని నిలదీశారు.

మతతత్వ బీజేపీకి హుజురాబాద్‌లో చోటులేదని స్పష్టం చేయాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. బీజేపీ వల్ల దళితులు, బీసీలు ఏం లబ్ది పొందారని అన్నారు. దేశంలో సగం జనాభా బీసీలేనని, దీనిపై ఈటల మాట్లాడట్లేదని మండిపడ్డారు.  

హుజురాబాద్ ఉపఎన్నిక కోసం రోజుకో కేంద్ర మంత్రి ఇక్కడికి వస్తారట.. వారందరికీ స్వాగతం అని హరీశ్ రావు అన్నారు. వచ్చినవారు కనీసం పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తామని చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం, హుజురాబాద్ మల్లన్న కమిటీ సభ్యులను పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు.

click me!