Huzurabad Bypoll: సీఎం కేసీఆర్ ఓ పిరికోడు.. రావణ రాజ్యం పోవాలి.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ రాములమ్మ..

By team teluguFirst Published Oct 21, 2021, 4:30 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్‌పై బీజేపీ  నాయకురాలు  విజయశాంతి (Vijayashanti) తీవ్ర  స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణలో రావణ  రాజ్యం  పోవాలని రాముడి  రాజ్యం రావాలి అంటూ పిలుపునిచ్చారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై, తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్‌పై బీజేపీ  నాయకురాలు  విజయశాంతి (Vijayashanti) తీవ్ర  స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణలో రావణ  రాజ్యం  పోవాలని రాముడి  రాజ్యం రావాలి అంటూ పిలుపునిచ్చారు. ప్రజలను  దోపిడి చేసే వ్యక్తి కేసీఆర్ అని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో బీజేపీ  అభ్యర్థి ఈటల రాజేందర్ (Etela Rajender) తరఫున  ప్రచారం  నిర్వహించారు. ఈ సందర్బంగా  విజయశాంతి  మాట్లాడుతూ... కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ ఒక పిరికోడని.. ఆయనకు దమ్ము, ధైర్యం లేదని అన్నారు. అందుకే హుజురాబాద్‌కు రాలేదని.. మరెక్కడో సభ పెడతానని అంటున్నారని చెప్పారు. ఒడిపోతామని  భయంతోనే కేసీఆర్ హుజురాబాద్‌కు రావడం లేదని  అన్నారు. దమ్ముంటే హుజురాబాద్‌కు వచ్చి ప్రజలతో మాట్లాడాలని  సీఎం కేసీఆర్‌కు (CM KCR) సవాలు  విసిరారు. 

ఆర్థికంగా, రాజకీయంగా, మానసికంగా ఎన్ని  దెబ్బలు  కొట్టాలో  కొట్టారు. కానీ బలహీన  వర్గాల బిడ్డగా, ఉద్యమ నేతగా, ధైర్యంతో ముందుకు  సాగుతున్నారు. ఈటల రాజేందర్‌ ఆరు సార్లు గెలిచాడంటే ప్రజల మద్దతు ఎలా ఉందో అర్ధమవుతుందన్నారు. జనాలు అందరూ ఈటల వైపే ఉన్నారని చెప్పారు. రాజేందర్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని నమ్మకం తనకు ఉందన్నారు. దేశంలో  జరిగిన  సర్వేలో చెత్త  ముఖ్యమంత్రి  కేసీఆర్  అని  తేలిందన్నారు. కేసీఆర్‌ను గద్దె దించాలని.. టీఆర్ఎస్‌ను సమాధి చెయ్యాలన్నారు. 

దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ మోసం అక్కడి నుండే మొదలైందన్నారు. ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా కాలంలో ఈటెల రాజేందర్ తన డ్యూటీ తను చేశాడని.. కానీ, కరోన కాలంలో ప్రాణ తీపితో బయటకు రాని ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఏడేళ్లు గా మంత్రి పదవిలో ఉన్న ఈటెలను ఏడూ నిమిషాల్లో తీసేశాడని మండిపడ్డారు. తన తల్లి  తెలంగాణ  పార్టీని నమ్మించి టీఆర్‌ఎస్‌లో  విలీనం చేశారని.. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చే సమయానికి  పార్టీ నుంచి తొలగించి రోడ్డు  మీద  నిలబెట్టారని చెప్పుకొచ్చారు. తాము  ఉద్యమాలు  చేస్తుంటే.. కేసీఆర్  ఏసీ  రూమ్‌లో కూర్చొని డబ్బులు,  వ్యాపారాల  గురించి మాట్లాడుకునేవాడని  ఆరోపించారు.  మేము మాట్లాడితే  తెలంగాణ ద్రోహి  అని ముద్రలేసేవాడని  చెప్పుకొచ్చారు.

దళిత  బంధు (Dalit Bandhu) అనేది మాయ.. హుజురాబాద్‌లో దళితుల ఓట్లు వేయించుకోవడం కోసం డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు.  కేసీఆర్ ప్రజలకు మేలు  చేయరి.. మోసం చేయడమే కేసీఆర్ పని అన్నారు. ప్రజలు ఈ  డ్రామాలు నమ్మవద్దని  కోరారు. బీజేపీ మీద నెపం నెట్టే  యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మూడు నెలల కింద  దళిత బంధు ఇస్తామని చెప్పారు..  మరి అప్పటి నుంచి ఎందుకు ఇవ్వలేదని  ప్రశ్నించారు. 

click me!