Huzurabad Bypoll: పోలీసుల ముమ్మర తనిఖీలు... కారులో తరలిస్తుండగా పట్టుబడ్డ నగదు

By Arun Kumar PFirst Published Oct 5, 2021, 2:01 PM IST
Highlights

హుజురాబాద్ ఉపఎన్నికల నేపధ్యంలో నియోజకవర్గంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఓ చెక్ పోస్ట్ వద్ద కారులో తరలిస్తున్న డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

కరీంనగర్ (Karimnagar): హుజురాబాద్ ఉపఎన్నిక (Huzurabad Bypoll) నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలో భారీగా మొహరించిన పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అలుగునూర్ వద్ద  చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాలను ఆపి తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న 4 లక్షల 50 వేల నగదును పోలీసులు పట్టుకున్నారు. నగదుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించారు.

ఇక నగదును తరలిస్తున్నవారిని అదుపులోకి తీసుకుని కారును కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి పట్టుబడిన నగదుకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు. ఈ నగదు ఎవరిది? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

read more  అష్టదిగ్భందంలో హుజురాబాద్... భారీగా మొహరించిన పోలీసులు, ముమ్మరంగా తనిఖీలు (వీడియో)

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హుజురాబాద్ ఉపఎన్నిక హాట్ టాపిక్. ఈ ఎన్నికను బిజెపి, టీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఉపఎన్నికలో ప్రజలను ప్రలోభాలకు గురిచేయడానికి భారీగా డబ్బులు పంచడానికి సిద్దమైనట్లు ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమల్లో వుండటంతో ఎలాంటి అక్రమాలు జరక్కుండా పోలీసులు చర్యలు చేపట్టారు. 

ఈ క్రమంలో ఇవాళ(మంగళవారం) తెల్లవారుజామునుండి హుజురాబాద్ పట్టణంలో పోలీసులను భారీగా మోహరించారు. పట్టణంలోని జమ్మికుంట రోడ్డు, కరీంనగర్ - వరంగల్ జాతీయ రహదారిపై ప్రైవేట్ వాహనాలు, అర్టిసి బస్సులను ఆపి తనిఖీ చేపట్టారు పోలీసులు. భారీగా డబ్బులను తీసుకువెళ్లే వారు అందుకు సంబంధించిన పత్రాలను వెంటపెట్టుకోవాలని సూచించారు. పోలీసుల తనిఖీలకు ప్రజలు సహకరించాలని పోలీసులు సూచించారు. 

ఇలా సాధారణ తనిఖీల్లో బాగంగా హుజురాబాద్ ప్రచారానికి వస్తున్న మంత్రి గంగుల కాన్వాయ్ ను కూడా నగర శివారులో పోలీసులు తనిఖీలు చేసారు. పోలీసుల తనిఖీలకు గంగుల పూర్తిగా సహకరించారు.  విదినిర్వహణలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగానికి అన్నివిదాలుగా సహకారం అందిస్తామని... వారి విధుల్ని సజావుగా చేసుకునేలా చూస్తామన్నారు మంత్రి గంగుల. 

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు. ఇదే స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా విద్యార్థిసంఘం నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్‌ఎస్‌‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్‌ (వెంకట నర్సింగరావు) బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే గెల్లు శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు.
 

click me!