నేను రాను బిడ్డో కాదు... నేను వస్త బిడ్డో తెలంగాణ సర్కార్ దవాఖానకు: మంత్రి హరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు

By Arun Kumar PFirst Published Sep 15, 2021, 4:41 PM IST
Highlights

 హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట పట్టణంలో జరిగిన స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు తెలంగాణలోని ప్రభుత్వ హాస్పిటల్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కరీంనగర్: నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే స్థాయి నుంచి ఇవాళ తెలంగాణలో నేను వస్తాను బిడ్డో సర్కారు దవాఖానకు అనేంతలా పరిస్థితి మారిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు పెరిగాయని... అందుకే ప్రజలు వైద్యం కోసం సర్కారు ఆస్పత్రులకే వస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ కిట్ పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వాలున్నాయి...ఎక్కడయినా ఇలాంటి పథకాలను అమలు చేస్తున్నారా? అని హరీష్ నిలదీశారు. 

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట పట్టణంలోని కొత్త వ్యవసాయ మార్కెట్ ఆవరణలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మాజీమంత్రి పెద్దిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కౌశిక్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మహిళా సంఘాలకు 2 కోట్ల 13 లక్షల 48 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి మిగతా గ్రూపులకు కూడా రూ. కోటి 50 లక్షలను కూడా బతుకమ్మ పండుగలోపు అందేలా చూస్తానని మంత్ర హామీ ఇచ్చారు. 

''తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ ఏడేళ్లలో అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. పేదింటి ఆడపిల్ల పెళ్లి కోసం కళ్యాణలక్ష్మీ పధకం ప్రవేశపెట్టాము. రూ. 50 వేలతో కళ్యాణ లక్ష్మీ పథకం ఎస్సిలతో ప్రారంభించి ఇవాళ అన్ని వర్గాల పేదలకు రూ. లక్షా 116 ఇస్తున్నాం. ఆసరా పెన్షన్ 200 ఉండేది... ఇచ్చిన మాట ప్రకారం రూ.2016 పెన్షన్ ఇస్తున్నాం. రాబోయే కొద్దిరోజుల్లో 57 ఏళ్ళు నిండిన మరో 4లక్షల మందికి కూడా పెన్షన్లు ఇవ్వనున్నాం. ఈ పెన్షన్ల వల్ల వృద్ధులకు భరోసా దొరికింది... కోడలుకు అత్తే ఆసరా అయింది. వృద్ధులు, వితంతువుల ఆత్మగౌరవం పెరిగింది... వాళ్ళను ప్రభుత్వం కడుపులో పెట్టుకుని చూసుకుంటోంది'' అని తెలిపారు. 

''రెండేళ్లలో ఇంటింటికి నల్లా పెట్టి మన అక్కాచెల్లెళ్ల బాధ తీర్చినం. ఇక జమ్మికుంటలో మహిళల కోసం కుటీర పరిశ్రమలు ప్రారంభించుకుందాం... దానికోసం ప్రత్యేక కార్యాచరణ తీసుకొస్తాం'' అని మంత్రి హరీష్ హామీ ఇచ్చారు. 

read more  Huzurabad Bypoll: స్పీడ్ పెంచిన టీఆర్ఎస్... ఇంటింటి ప్రచారానికి మంత్రి కొప్పుల శ్రీకారం

''ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏమిచ్చిందో ఆలోచించాలి. సిలిండర్ ధర రూ. 1000 పెరిగింది. పెట్రోల్, డీజిల్, వంట నూనె ధరలు పెంచుతుంది. ఈ ధరలను పెంచుతుంది ఎవరో... పేద ప్రజలను ఆదుకుంటోంది ఎవరో ఆలోచించాలి. మిమ్మల్ని కడుపులో పెట్టుకుని కాపాడుకుంటోంది టీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి మాయ మాటలకు మోసపోవద్దు'' అని సూచించారు. 

''తెలంగాణలో ప్రతి మంత్రికి సీఎం కేసీఆర్ 4 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారు. మేమంతా మా నియోజకవర్గాల్లో పైసా ఖర్చు లేకుండా పేదలను ఇండ్లలోకి పంపించాము. కానీ హుజురాబాద్ నియోజకవర్గానికి 5 వేల ఇండ్లు ఇస్తే కనీసం 5 ఇండ్లు అయినా కట్టరా...? కానీ ఇప్పుడు మేము పెండింగ్ లో ఉన్న ఇండ్లను పూర్తి చేస్తాం. జాగా ఉన్నవాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టి ఇస్తాం'' అని భరోసా ఇచ్చారు. 

''పేదలకు పంచింది ఎవరు... పేదలపై భారం వేసింది ఎవరు ఆలోచించాలి. తెలంగాణ వచ్చాక లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చాము. మరో 50 నుండి 60 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. ఉద్యోగాలు ఇస్తున్నది టీఆర్ఎస్... ఉద్యోగాలు ఊడగొడుతున్నది బీజేపీ. ఉన్న సంస్థలు, ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు'' అని తెలిపారు.

''జమ్మికుంట అభివృద్ధికి ఇప్పటికే రూ.35 కోట్లు ఇచ్చాము. ఇతర  పనులకు కూడా నిధులు ఇచ్చుకుందాం. నాయిని చెరువును సుందరంగా తీర్చిదిద్దుతాం. వ్యక్తికి లాభం జరిగితే మనం నష్టపోతాం.. పని చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి'' అని హరీష్ రావు ప్రజలను కోరారు. 


 

click me!