Huzurabad Bypoll: హుజురాబాద్ అభివృద్ది ఓట్ల కోసం కాదు... ఇది మా బాధ్యత: మంత్రి గంగుల

By Arun Kumar PFirst Published Oct 3, 2021, 2:07 PM IST
Highlights

కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట డెవలప్ అయినట్టుగా ఇక్కడ డెవలప్ ఎందుకు చేయలేదని హుజురాబాద్ ప్రజలను అడిగారు మంత్రి గంగుల కమలాకర్. ఆ స్థాయిలో ఇకపై హుజురాబాద్ అభివృద్ది వుంటుందన్నారు. 

హుజురాబాద్: ఇవాళ(ఆదివారం) ఉదయం హుజురాబాద్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు మంత్రి గంగుల కమలాకర్. స్థానిక ప్రజలతో కలిసి బోర్నపల్లితో పాటు ఇతర ప్రాంతాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కి ఓటేయాలంటూ ప్రచారం చేశారు.  

ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ... తాజా మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పూర్తి నిర్లక్ష్యంతో హుజురాబాద్ పట్టణంలోని 350 రోడ్లలో కనీసం మూడు రోడ్లను కూడా సరిగా వేయలేదన్నారు. స్థానికులు చెప్పులరిగేలా ఈటెల చుట్టూ తిరిగి దరఖాస్తులు ఇచ్చినా స్పందించకపోవడం దారుణమన్నారు. కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేటలు డెవలప్ అయినట్టుగా ఇక్కడ డెవలప్ ఎందుకు చేయలేదని అన్నారు. 

ఐటీతో పాటు అన్నిరకాల కంపెనీలు ఈ మూడు పట్టణాలకు వస్తున్నాయని... అదే మాదిరిగా ఇక్కడికి సైతం అభివృద్ధిని తీసుకురావడానికి ఎన్ని కోట్లైనా ఖర్చుపెట్టడానికి సీఎం కేసీఆర్ సిద్దంగా ఉన్నారన్నారు. ఇప్పటికే రూ.50కోట్లతో రోడ్ల పనులు కొనసాగుతున్నాయని... వాటికి అదనంగా కోటీ డెబ్బై లక్షలతో రెండు బ్రిడ్జి పనులు జరుగుతున్నాయన్నారు మంత్రి గంగుల, 

అడిగిన వారికి అడిగినట్టుగా అన్నీ అందిస్తున్నామన్నారు. ఆత్మగౌరవం కోసం కుల సంఘ భవనాలు, పెద్దమ్మ వంటి గ్రామదేవతల గుడులు అన్నీ కట్టిస్తున్నామన్నారు. ఇవి కేవలం ఎన్నికల కోసం కాదని... గత ఎమ్మెల్యే చేయలేదు కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకొని చేస్తుందన్నారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగించడానికి గెల్లు శ్రీనివాస్ కు మద్దతు ఇవ్వాలన్నారు గంగుల.

read more  Huzurabad Bypoll: బిజెపికి బిగ్ షాక్... టీఆర్ఎస్ లోకి కరీంనగర్ ఏబివిపి మాజీ కన్వీనర్
    
గతంలో తెలంగాణ కరెంటు లేక, నీళ్లు లేక, భూముల బీళ్లువారి, కరెంటుకోసం పోలాల్లో పడిగాపులు కాసి, కాలిపోయే మోటార్లతో సబ్ స్టేషన్ల వద్ద నిరసన తెలుపుతూ, వలసలతో అరిగోస పడిందన్నారు. ఆ భాదల్ని రూపుమాపి బంగారు తెలంగాణగా మార్చాలనే సీఎం కేసీఆర్ చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చారన్నారు మంత్రి గంగుల. 

ఉద్యమ నాయకుడి సారథ్యంలో రైతుబందు, రైతుబీమా, ఆసరాఫించన్లు, 24గంటల ఉచిత కరెంటు, కాళేశ్వరంతో పుష్కలంగా నీళ్లు, సమృద్దిగా పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించిన పార్టీ టీఆర్ఎస్ అన్నారు. 
గతంలో రూ.3వేలకు ఎకరా పొలాన్ని ట్రాక్టర్ దున్నేదని... కానీ నేడు కేంద్రంలోని బీజేపీ పెంచిన డీజిల్ ధరలతో రైతులు కుదేలవుతున్నారన్నారు. అన్నింటిని ప్రైవేటుపరం చేస్తున్నారన్నారు. రేపు మన పొలాల దగ్గర కరెంటు మీటర్లు పెట్టబోతున్నారని... ఇలా మన జీవితాల్ని చిన్నాబిన్నం చేస్తున్న బీజేపీకి ఎందుకు ఓటేయాలన్నారు. 

ఈ కార్యక్రమంలో మంత్రి గంగులతో పాటు 14వ వార్డు టి.ఆర్.ఎస్.పార్టీ ఇంచార్జ్ ఘంట మధుకర్ ,కరీంనగర్ రూరల్ ఫ్యాక్స్ చైర్మన్ ఆనంద్ రావు, దొంత రమేష్ కుమార్,కొమురయ్య, రాజుతో పాటు గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.

click me!