టీఆర్ఎస్ నీచం... ఆ పార్టీ నాయకులు పరమ నీచం: మాటలఘాటు పెంచిన ఈటల (వీడియో)

By Arun Kumar PFirst Published Sep 28, 2021, 4:46 PM IST
Highlights

హుజురాబాద్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్ మాటల ఘాటు పెంచారు.టీఆర్ఎస్ పార్టీతో పాటు నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

హుజూరాబాద్: హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ వెలువడిన నేపధ్యంలో బిజెపి నాయకులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాటల ఘాటు పెంచారు. ప్రస్తుతం అధికారంలో వున్న టీఆర్ఎస్ పార్టీ నీచానికి దిగితే... ఆ పార్టీ నాయకులు పరమ నీచానికి దిగుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల గంట మోగింది కాబట్టి ఏ ఇంటికి ఆ ఇల్లు కథానాయకులై ఎన్నికల కదనరంగాన్ని నడపాలని అన్నారు. 

హుజురాబాద్ మధువని గార్డెన్ లో ఈటల మీడియాతో మాట్లాడారు. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడిందని... ఐదు నెలల పాటు టీఆర్ఎస్ నేతల హింసను భరించిన తరువాత కూడా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు తన వెంటే ఉన్నారన్నారు. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఉపఎన్నిక అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం జరుగుతున్నది కాదని... ఇది కెసిఆర్ అహంకారానికి, హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి జరుగుతున్నదని ఈటల అన్నారు. 

వీడియో

హుజురాబాద్ ప్రజలు తనవెంటే వున్నారని... వారిని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. అధికారాన్ని ఉపయోగించి టీఆర్ఎస్ పార్టీ భారీగా దొంగ ఓట్లను నమోదు చేస్తోందని... దాన్ని అడ్డుకోవాలని కోరారు. ఓటర్లను బెదిరించడం, దొంగ ఓట్లు వేయడం వంటిని చేసేవారికి శిక్ష తప్పదని ఈటల హెచ్చరించారు. 

read more  Huzurabad Bypoll: ఎలక్షన్ కోడ్ అమల్లోకి... రిటర్నింగ్ అధికారి ఆయనే..: కరీంనగర్ కలెక్టర్ (వీడియో)

మంత్రి హరీష్ రావుతో పాటు అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు హుజురాబాద్ పై పడ్డారని అన్నారు. తన వెంటున్న నాయకులను బెదిరించి తమవైపుకు తిప్పుకోడానికి విశ్వ ప్రయత్నాలు చేశారని అన్నారు. స్వయంగా మంత్రి హరీష్‌రావు సర్పంచ్‌ లు, ఎంపీటీసీల మీద చిందులేశాడని ఈటల గుర్తుచేశారు. బెదిరింపులు, కుట్రలతో హుజురాబాద్ ప్రజలను ఏమి చేయలేరని ఈటల అన్నారు.

ఈ మీడియా సమావేశంలో ఈటలతో పాటు హుజూరాబాద్ ఎన్నికల బిజెపి ఇంఛార్జి జితేందర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు కృష్ణా రెడ్డి,  బీజేపీ సీనియర్ నాయకులు ఇంద్రసేనారెడ్డి, ఎండల లక్ష్మీ నారాయణ, ధర్మారావు, తుల ఉమ, అశ్వద్ధామ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ దేశంలో వివిధ కారణాలతో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగానే హుజురాబాద్ ఉపఎన్నికకు అక్టోబర్ 1వ తేదీన నోటిఫికేషన్ (election notification) విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అదే రోజు నుండి నామినేషన్లను కూడా స్వీకరిస్తారు. అక్టోబర్ 8వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించి అక్టోబర్ 11న నామినేషన్లను పరిశీలించనున్నారు. ఇక అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 2న కౌంటింగ్ (counting)నిర్వహిస్తారు. 

click me!