Huzurabad Bypoll:వాళ్లందరూ తుపాకులు అప్పగించాల్సిందే..: కరీంనగర్ సిపి ఆదేశాలు

Arun Kumar P   | Asianet News
Published : Sep 30, 2021, 11:30 AM ISTUpdated : Sep 30, 2021, 11:47 AM IST
Huzurabad Bypoll:వాళ్లందరూ తుపాకులు అప్పగించాల్సిందే..: కరీంనగర్ సిపి ఆదేశాలు

సారాంశం

హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో తుపాకులు కలిగినవారు వెంటనే వాటిన సమీప పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయాలని సిపి సత్యనారాయణ ఆదేశించారు. 

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక (Huzurabad Bypoll) నేపథ్యంలో కరీంనగర్ (Karimnagar) జిల్లాలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా కరీంనగర్ పోలీసులు ముందుస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే జిల్లాలో లైసెన్స్‌ తుపాకులపై పోలీసులు దృష్టిపెట్టారు. తుపాకులకు కలిగివున్నవారు వెంటనే వాటిని సమీపంలోని పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేయాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ సత్యనారాయణ (CP Satyanarayana) ఆదేశించారు. 

''ఆయుధాల చట్టం 1959సెక్షన్ 21 ప్రకారం కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో నివాసముంటూ వ్యక్తిగత భద్రత కోసం లెసెన్స్ తుపాకులు కలిగినవారు వెంటనే వాటిని పోలీసులకు అప్పగించాలి. తమ ఆదేశాలు పట్టించుకోకుండా తుపాకులను తమవద్దే వుంచుకునే వారిపై కేసులు పెట్టడానికి కూడా వెనుకాడబోం'' అని సిపి హెచ్చరించారు. 

''హుజురాబాద్ ఉపఎన్నిక సందర్భంగా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అందులో భాగంగానే తుపాకులను డిపాజిట్ చేయండి. ఎన్నికలు ముగిసిన తర్వాత నవంబర్ 6వ తేదీన తిరిగి ఎవరి తుపాకులు వారు తీసుకోవచ్చు. ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే భద్రతా సిబ్బంది, జాతీయ బ్యాంకుల వద్ద గార్డులుగా విధులు నిర్వర్తించే వారు ఆయుధాలను కలిగివుండవచ్చు'' అని సిపి సత్యనారాయణ తెలిపారు. 

Read more  Huzurabad Bypoll: దూకుడు పెంచిన ఈటల... బిజెపిలోకి భారీగా చేరికలు

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. ఇప్పటికే ఇక్కడ ఉపఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ని ఈసీ ప్రకటించింది. అక్టోబర్ 1వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ (election notification) విడుదల కానుంది. అదే రోజు నుండి నామినేషన్లను స్వీకరిస్తారు.  అక్టోబర్ 8వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహిస్తారు. అక్టోబర్ 11న నామినేషన్లను పరిశీలించనున్నారు. నవంబర్ 2న కౌంటింగ్ (counting)నిర్వహిస్తారు. 

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీ చేయనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని ఇంకా ఖరారు చేయలేదు.  
 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?