
మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మరిపెడ మండలం పరిధిలో ఓ ప్రజాప్రతినిధి తన భార్యను గొడ్డలితో కిరాతకంగా హత్య చేశాడు. వివరాలు.. మరిపెడ మండలం పరిధిలోని ఆనకట్ట తండా ఉపసర్పంచ్ రవీందర్‌కు మమతతో దాదాపు ఆరేళ్ల కిందట వివాహం జరిగింది. అయితే ఈ రోజు తెల్లవారుజామున రవీందర్.. మమతపై దాడిచేసి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న మమత బంధువులు.. పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరుకున్నారు. రవీందర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు రవీందర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అయితే భార్య మమతపై అనుమానం పెంచుకోవడంతోనే రవీందర్ ఈ ఘాతుకాని పాల్పడి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు రవీందర్ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.