
మంకీ పాక్స్ కలకలం దేశంలోనూ మొదలైంది. ఇప్పటికే మన దేశంలో నాలుగైదు మంకీ పాక్స్ కేసులు నమోదైనట్లు గుర్తించారు. ఇప్పటి వరకు కేరళ, ఢిల్లీల్లో ఈ మంకీ పాక్స్ కేసులు నమోదు కాగా.. సోమవారం తెలంగాణ రాష్ట్రంలోనూ తొలి మంకీ పాక్స్ కేసు నమోదైంది.
మంకీపాక్స్ లక్షణాలతో ఆదివారం కామారెడ్డికి చెందిన ఓ 40ఏళ్ల వ్యక్తి ఫీవర్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి మాత్రం నిలకడగా ఉందని తెలుస్తోంది. అతనికి సోమవారం వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. దాని ఫలితాలు నేడు రానున్నాయి.
ఫీవర్ హాస్పిటల్ వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడి ముఖం, ఛాతీ, మెడ చేతులపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. మంకీ పాక్స్ లక్షణాలు అతనిలో కనిపించడంతో.. దానికి తగిన చికిత్సను అందిస్తున్నారు.
రోగి జూలై 6న కువైట్ నుండి స్వదేశానికి తిరిగి వచ్చాడు. కాగా.. జూలై 20న అతనిికి జ్వరం వచ్చింది. జూలై 23న అతనికి ఒంటిపై దద్దుర్లు వచ్చాయి. వెంటనే ఆయన కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు మంకీ పాక్స్ లక్షణాలు ఉన్నాయి అని చెప్పడంతో.. ఆయన స్థానిక ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అక్కడి నుంచి... ఆయనను అక్కడి వైద్యులు హైదరాబాద్ లోని ఫీవర్ ఆస్పత్రికి తరలించారు.
కాగా.. ఈ ఘటనపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పందించారు. గాంధీ ఆసుపత్రి, పూణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ రోగి నమూనాలను విశ్లేషిస్తాయని చెప్పారు. విమానాశ్రయాల్లో ప్రయాణికులకు మంకీపాక్స్ స్క్రీనింగ్ గురించి అడిగినప్పుడు, ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని చెప్పారు.
"ప్రయాణికులు ముఖ్యంగా గల్ఫ్, ఆఫ్రికా నుండి వచ్చిన వారిని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతాలలో వైరస్ ఎక్కువగా ఉందని ట్రెండ్‌లు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, విమానాశ్రయాలలో మంకీ పాక్స్ కు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించాలని మేము భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాము" అని హరీష్ రావు చెప్పారు. .