
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ స్వాతి (swathi) ఆత్మహత్య (suicide) చేసుకున్న కేసులో ఆమె భర్త సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత శనివారం పిల్లలకు ఉరేసి తానూ ఆత్మహత్య చేసుకుంది స్వాతి. భర్త వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నానంటూ స్వాతి సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. స్వాతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో భర్తపై 304 బీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
Also Read:దారుణం: భార్యాభర్తల మధ్య గొడవలు... ఇద్దరు పిల్లలకి ఉరేసి, తల్లి ఆత్మహత్య
కాగా.. రాజేంద్రనగర్ (rajendra nagar) ఉప్పర్‌పల్లి (upperpally) ప్రాంతంలోని ఫోర్ట్ వ్యూ కాలనీలో కాపురం పెట్టారు. వివాహం జరిగిన 6 నెలలకు గర్భవతి కావడంతో స్వాతి ఉద్యోగం మానేసింది. తర్వాత వారికి కుమారుడు తన్విక్ శ్రీ (4), కుమార్తె శ్రేయ పుట్టారు. అయితే కుమార్తె పుట్టనప్పటి నుంచి సాయికుమార్ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. బంగారం, డబ్బులు తీసుకురావాలని స్వాతిపై ఒత్తిడితెచ్చాడు. ఒకట్రెండు సార్లు స్వాతి డబ్బులు తీసుకురావడంతో ఇదే పనిగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో జల్సాలకు అలవాటు పడి స్వాతి బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టాడంతో కొన్నింటిని అమ్మేశాడు. దీనితో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు సాగుతున్నాయి.
ఈ క్రమంలో స్వాతి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. శుక్రవారం రాత్రి పిల్లలను తీసుకుని బెడ్రూంలోకి వెళ్లి గడియ వేసుకుంది. శుక్రవారం రాత్రంతా బయట తిరిగిన సాయికుమార్.. శనివారం సాయంత్రం దాకా ఏమీ పట్టించుకోలేదు. సాయంత్రం 5 గంటల సమయంలో వెళ్లి బెడ్రూం తలుపుతట్టినా లోపలి నుంచి ఏ స్పందనా రాలేదు. తలుపులు బద్దలుకొట్టి చూడగా.. స్వాతి ఉరివేసుకుని కనిపించింది.