పూణె పోలీసుల సోదాలు: వరవరరావు ఇంటి వద్ద ఉద్రిక్తత

By narsimha lode  |  First Published Aug 28, 2018, 12:29 PM IST

పూణె పోలీసులు విరసం నేత  వరవరరావు ఇంటితో పాటు  మరో ముగ్గురి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో   గాంధీనగర్  ఇంటి వద్ద ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నారు


హైదరాబాద్: పూణె పోలీసులు విరసం నేత  వరవరరావు ఇంటితో పాటు  మరో ముగ్గురి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో   గాంధీనగర్  ఇంటి వద్ద ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరును ప్రజా సంఘాలు తప్పుబడుతున్నాయి.

ప్రధానమంత్రి మోడీని... మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తరహాలోనే హత్య చేయాలని  మావోయిస్టులు కుట్ర పన్నారనే విషయమై పూణెలో పోలీసులకు దొరికిన లేఖ ఆధారంగా విరసం నేత వరవరరావు ఇంటితో పాటు  ఇద్దరు జర్నలిస్టులు కూర్మనాథ్, క్రాంతి టేకుల, ఇఫ్లూ ప్రోఫెసర్  సత్యనారాయణ ఇళ్లలో పోలీసులు మంగళవారం ఉదయం సోదాలు నిర్వహిస్తున్నారు.

Latest Videos

undefined

మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాల్లో స్టాన్‌స్వామీ, అరుణ్ ఫరేరా, సుశాంత్ అబ్రహం ఇళ్లలో కూడ పోలీసులు  సోదాలు నిర్వహిస్తున్నారు. హైద్రాబాద్‌లో మాత్రం నలుగురి ఇళ్లలో ఏకకాలంలో దాడులు సాగుతున్నాయి.

పూణె పోలీసులు స్వాధీనం చేసుకొన్న లేఖ బూటకమని  మాజీ సుప్రీంకోర్టు జడ్జి మార్కండేయ ఖట్జూతో పాటు కాంగ్రెస్ పార్టీ  ఖండించిన విషయాన్ని ప్రజా సంఘాలు గుర్తు చేస్తున్నాయి. మోడీ తన గ్రాఫ్ పడిపోతోందని భావించి... తన గ్రాఫ్‌ను పెంచుకొనేందుకు గాను  ఈ లేఖను సృష్టించారని  ప్రజాసంఘాలు  ఆరోపణలు చేస్తున్నాయి. 

అణగారిన వర్గాలకు అండగా ఉంటున్నందునే  వరవరరావుపై పోలీసులు కేసులు పెడుతున్నారని ప్రజా సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. 1973 నుండి  వరవరరావుపై పోలీసుల దమనకాండ, దౌర్జన్యాలు సాగుతున్నాయని  ప్రజాసంఘాలు గుర్తు చేస్తున్నాయి.

వరవరరావు‌తో పాటు మరో ముగ్గురి ఇళ్లపై దాడులు నిర్వహిస్తున్న సమయంలో కనీసం వాళ్ల ఫోన్లు కూడ ఇవ్వలేదన్నారు.  ఈ సమాచారం బయటకు రాకుండా ఉండేందుకు గాను పోలీసులు  పథకం ప్రకారంగా వ్యవహరించారని ప్రజా సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి.

అయితే ఇదిలా ఉంటే  ప్రజల గొంతును విన్పించకుండా నొక్కిపెట్టేందుకే  పోలీసులు వరవరరావు ఇంటిపై దాడులు నిర్వహిస్తున్నారని  ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. సెర్చ్ వారంట్ లేకుండానే పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారని ప్రజాసంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి.

వరవరరావుతో పాటు మరికొందరి ఇళ్లపై పోలీసుల సోదాలను నిరసిస్తూ మంగళవారం నాడు  నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు గో బ్యాక్ అంటూ  ప్ల కార్డులు ప్రదర్శించారు. వరవరరావు ఇంటి వద్ద భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేస్తుండడంతో పోలీసులు ప్రజా సంఘాల నేతలను అదుపులోకి తీసుకొని సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో వరవరరావు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది.

ఈ వార్తలు చదవండి

మోడీ హత్య కుట్రలో పేరు: వరవరరావుఇంట్లో తనిఖీలు

మోడీ హత్యకు మావోల కుట్ర: లేఖలో వరవరరావు పేరు

click me!