
దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పడిపోతున్న సంగతి తెలిసిందే. సామాజిక దూరం, మాస్క్ ధరించడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవడంతో కోవిడ్ ఉద్ధృతి తగ్గింది.
ఈ క్రమంలో కరీంనగర్ నగర శివారు చేగుర్తిలో పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడం అధికారులను ఆందోళన కలిగిస్తోంది. 10 రోజుల క్రితం ఓ వ్యక్తి అనారోగ్యంతోనే చనిపోయాడని భావించిన గ్రామస్థులు.. ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
అందులో పాల్గొన్న వారిలో ఒకరికి కోవిడ్ నిర్ధారణ కావడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. రంగంలోకి దిగిన అధికారులు చేగుర్తిలో ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేసి నమూనాలను సేకరించారు.
Also Read:తెలంగాణ : కొత్తగా 165 కరోనా కేసులు
నిన్న 45 మంది నమూనాలు పరీక్షించగా 16 మందికి, ఈరోజు మరో 17 మంది కలిపి మొత్తం 33 మందికి కొవిడ్ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. బాధితులను హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించినట్లు చెప్పారు.
మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల్లోనూ వైద్యశిబిరాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దేశంలో కరోనా ప్రవేశించిన తొలి నాళ్లలో కరీంనగర్‌లో ఇదే స్థాయిలో కేసులు బయటపడటంతో ప్రభుత్వం వర్గాలు ఆందోళన చేస్తున్నాయి.