పటిష్ట భద్రతను ఛేదించి... నిజాం మ్యూజియంలో దొంగతనం ఎలా సాధ్యమైంది..?

Published : Sep 04, 2018, 11:24 AM ISTUpdated : Sep 09, 2018, 02:04 PM IST
పటిష్ట భద్రతను ఛేదించి... నిజాం మ్యూజియంలో దొంగతనం ఎలా సాధ్యమైంది..?

సారాంశం

హైదరాబాద్ నిజాం మ్యూజియంలో దొంగతనం జరగడం.. కోట్లాది రూపాయల విలువ చేసే చారిత్రక సంపదను దొంగలు అపహరించుకుపోవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలగిస్తోంది.

హైదరాబాద్ నిజాం మ్యూజియంలో దొంగతనం జరగడం.. కోట్లాది రూపాయల విలువ చేసే చారిత్రక సంపదను దొంగలు అపహరించుకుపోవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలగిస్తోంది. నిజాం మ్యూజియంలో చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో అలెర్ట్ చేసే పటిష్ట భద్రత ఉంటుంది. సెక్యూరిటీ అలారమ్‌లు, ఎలక్ట్రిక్ కంచె లాంటి భద్రత ఉంటుంది. 

ఇంతటి రక్షణ వలయాన్ని చేధించుకుని దొంగలు లోపలికి ఎలా రాగలిగారు.. సీసీ కెమెరాలకు సైతం చిక్కకుండా అత్యంత చాకచాక్యంగా ఎలా దొంగతనం చేశారన్నది రక్షణ  నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఎప్పటిలాగానే ప్రజల సందర్శన అయిన తర్వాత ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు మ్యూజియానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. 

అనంతరం సోమవారం ఉదయం మ్యూజియం గ్యాలరీ తలుపు తెరిచేసరికి విలువైన వస్తువుల కనిపించలేదు. గ్యాలరీ వెంటిలేటర్ నుంచి తాడు వేలాడుతూ కనిపించడంతో.. చోరీ జరిగిందని నిర్థారించుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం... దుండగులు మ్యూజియం మొదటి అంతస్తులోని వెంటిలేటర్‌ ఇనుప కడ్డీలను తొలగించారు. అనంతరం 20 అడుగుల తాడు సాయంతో లోపలికి ప్రవేశించారు. మ్యూజియం లోపల పది సీసీ కెమెరాలు ఉన్నాయి... అయితే ఒక్క సీసీ కెమెరాకు సైతం చిక్కకుండా నిందితులు జాగ్రత్తలు తీసుకున్నారు. 

మ్యూజియం సమీపంలో వెంటిలేటర్‌ను చిత్రీకరించేలా ఉన్న కెమెరా దిశను దుండగులు మార్చివేశారు. పై నుంచి లోపలికి దిగే క్రమంలో దుండగుడు సీసీ కెమెరాపై కాలు పెట్టడంతో అది ధ్వంసమైంది. అయితే ఒక కెమెరాలో మాత్రం దుండగుడు సంచరిస్తున్న దృశ్యం నమోదైంది... అతడి వీపు మాత్రమే కనిపిస్తుండటంతో స్పష్టత లేకుండా పోయింది. దొంగతనం జరిగిన తీరు.. దుండగులు లోపలికి ప్రవేశించిన తీరు పక్కా స్కెచ్‌తోనే రంగంలోకి దిగినట్లుగా కనిపిస్తోంది. మ్యూజియంలో పనిచేసే సిబ్బంది ఎవరైనా భద్రతా సమాచారాన్ని దుండగులకు అప్పగించారా..? లేక వారిలో ఎవరైనా చోరీకి పాల్పడ్డారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి:

నిజాం మ్యూజియంలో భారీ చోరీ.. విలువైన వస్తువులు అపహరణ
 

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu