
ఇంటి యజమాని తిట్టాడని హైదరాబాద్ కూకట్ పల్లిలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటి గోడలపై సూసైడ్ నోట్ రాసి మరీ ఈ దారుణానికి పాల్పడింది. కూకట్‌పల్లి మెడికల్ సొసైటీ పరిధిలోప్రసన్న కుమార్ అనే వ్యక్తికి చెందిన ఇంట్లో ఆంధ్రప్రదేశ్ లోని పాలకొల్లుకు చెందిన రామకృష్ణ, సుజాత దంపతులు రెండేళ్లుగా అద్దెకు ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదివారం రాత్రి పిల్లలు అల్లరి చేస్తున్నారంటూ ఓనర్ సుజాతతో గొడవపెట్టుకున్నాడు.
ఆ సమయంలో సుజాత భర్త ఇంట్లో లేరు. భర్త లేని సమయంలో ఓనర్ వచ్చి తిట్టడంతో మనస్థాపానికి గురైన సుజాత ఇంట్లో ప్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా తన చావుకు ఇంటి యజమాని కారణమంటూ ఇంట్లో గోడలు, తలుపులపై రాసి ఆమె ఈ దారుణానికి పాల్పడింది. కూకట్‌పల్లి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి యజమాని పరారీలో ఉన్నాడు.