
రోగికి చికిత్స చేయడానికంటే ముందే అతడి జేబుకు చికిత్స చేయడంలో గాంధీ ఆస్పత్రి సిబ్బంది నిపుణులు. జలగలాగ జేబులో డబ్బులు అయిపోయేవరకు రోగిని పీల్చుతూనే ఉంటారు. వారి అవినీతి, నిర్లక్ష్యంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నా పరిస్థితి మారడం లేదు.
గాంధీ ఆస్పత్రిలో ఈ రోజు జరిగిన ఓ సంఘటన సర్కారు దావఖానాలో సిబ్బంది అరాచకం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుంది.
బేగంపేటకు చెందిన రాజు కు ప్రమాదంలో రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. దీంతో అతను చికిత్స కోసం కొన్ని రోజుల కిందట గాంధీ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ సిబ్బంది రూ.100 ఇస్తేనే వీల్ చైర్ ఇస్తామని లేకుంటే కదలనిచ్చేదే లేదని డిమాండ్ చేశారు. దీంతో చేసేది లేక రాజు వంద రూపాయిలు ఇచ్చి డాక్టరుకు చూపించుకున్నాడు.
అయితే అక్కడి సిబ్బంది వీల్ చైర్ కోసం అడుగుతన్న డబ్బులు ఇవ్వలేక ఈ రోజు చికిత్స కోసం గాంధీ ఆస్పత్రి వచ్చిన రాజు వీల్ చైర్ కు బదులుగా ఇంటి నుంచి తెచ్చుకున్న బొమ్మ బైక్ తో ఆస్పత్రి లోపలి వెళ్లాడు.
చచ్చుబడిపోయిన కాళ్లతో బొమ్మ బైక్ పై వెళుతున్నా అతడిని సిబ్బంది కనీసం పట్టించుకోలేదు. అయితే అక్కడున్న మీడియా ఈ దృష్యాన్ని వీడియో తీస్తుండటంతో వెంటనే సిబ్బంది అప్రమత్తమై వీల్ చైర్ ను తీసుకొచ్చి రాజును డాక్టర్ రూంకి తీసుకెళ్లారు.