
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సీఎల్పీ నేత జానారెడ్డి ఏం మాట్లాడినా ఏం మాట్లాడాడు అనే అనిపిస్తుంది. ముఖ్యంగా జర్నలిస్టులకు.
ఆయన మాటలతో సొంత పార్టీకే ఒక్కోసారి ఇబ్బందికర పరిణామాలు తలెత్తుతుంటాయి.
గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ రూ. 5 భోజనం పార్సిల్ తెప్పించుకొని గాంధీ భవన్ లో తిని దాని రుచిని పొగిడారు. అలా హైదరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ గెలుపునకు తన వంతు సాయం చేశారు.
ఇక శాసనసభలో కూడా టీఆర్ఎస్ పార్టీని ఇరుకునపెట్టాలని ప్రయత్నించి తన పార్టీనే ప్రతీసారి ఇరుకపడేస్తారు.
నిన్న అప్పులు చేయడం మంచిదేనని కేసీఆర్ సర్కారు అప్పులపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగానే మాట్లాడారు. ఈ రోజు అసెంబ్లీలో ప్రభుత్వ తీరుపై దులిపేశారు. ముఖ్యంగా చత్తీస్‌ఘడ్ విద్యుత్ ఒప్పందంలో లోపాలున్నాయని, ఆ విద్యుత్ వాడుకోకున్నా యూనిట్‌కు రూ.3 చెల్లించాల్సిందేనన్నారు.
ఎన్నికల నాటికి డబుల్ బెడ్ రూం ఇళ్లు పూర్తి చేయరని, మోడల్‌గా కొన్ని ఇళ్లు చూపించి ఎన్నికలకు వెళ్తారని జోస్యం చెప్పారు. అబ్బో ప్రభుత్వంపై జానా బాగానే సీరియస్ అయిపోతున్నారనే సమయానికి ఆయనకు బాహుబలి సినిమా గుర్తించింది. వెంటనే ‘ఎన్నికల నాటికి బాహుబలి వస్తాడు. సినిమాకు ఎవడు ముగింపు ఇస్తే వాడే బాహుబలి. ఆదర్శ రాజకీయాలకు నేను విత్తనం లాంటి వాడిని. విత్తనాన్ని కాపాడుకుంటే పంట తర్వాత పండించుకోవచ్చు’ అని అర్థంకాని మాటలతో ప్రసంగాన్ని ముగించారు.