హిమాయత్‌సాగర్ జలాశయానికి భారీ వరద, గేట్లు ఎత్తివేత.. లోతట్టు ప్రాంతాలకు అలర్ట్

By Siva KodatiFirst Published Oct 6, 2022, 7:23 PM IST
Highlights

హైదరాబాద్‌లో గత కొన్నిరోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ జలాశయంలో వరద నీరు చేరుతోంది. దీంతో గురువారం రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడిచిపెట్టారు. 

గత కొన్నిరోజులుగా హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాల దాటికి నగరంలోని జంట జలాశయాలకు భారీగా వరద నీరు పోటెత్తింది. ముఖ్యంగా హిమాయత్‌సాగర్‌ నిండు కుండలా మారింది. ఈ నేపథ్యంలో గురువారం హిమాయత్ సాగర్ 2 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు అధికారులు. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1763.5 అడుగులు. అటు వికారాబాద్‌లో భారీ వర్షానికి పొంగిపొర్లుతున్నాయి వాగులు. పెద్దేముల్‌లో పొంగిపొర్లుతోంది ఘాజిపూర్ వాగు. తాండూర్- కోట్‌పల్లి- సంగారెడ్డి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. యాలాలలో కాగ్నవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రస్నం, బాగాయిపల్లి, ముదయపేట్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 

అటు ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగానూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.  కోస్తాంధ్రను అనుకుని పరిసర ప్రాంతాల్లో ఉపరిత ద్రోణి కొనసాగుతుంది. ఉపరితల ద్రోణికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. కోస్తాంధ్ర నుంచి ఉత్తరప్రదేశ్‌ వరకు 3.1 కి.మీ ఎత్తులో ఉపరితల అవర్తనం విస్తరించింది. ద్రోణి, ఉపరిత ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రా జిల్లాల్లో మరో 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాయలసీమ జిల్లాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

ALso REad:ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు.. ఆ జిల్లాలకు అలర్ట్.. అతి భారీ వర్షాలు కురిసే చాన్స్..

ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వంశధార దేశిబట్టికి రెండుచోట్ల గండిపడి పొలాలు నీటమునిగాయి. జిల్లాలోని పలాస మండలం కేదారిపురం వరహాల గెడ్డలో పడి నిన్న ఇద్దరు గల్లంతయ్యారు. వర్షం కారణంగా పరహాల గెడ్డకు వరద నీరు పోటెత్తడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో గల్లైంతన పాడి శంకర్ మృతదేహాన్ని ఈ రోజు ఉదయం వెలికితీశారు. మరోవ్యక్తి కూర్మారావు కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. 

ప్రకాశం, తిరుపతి జిల్లాలో కూడా భారీ వర్షాలు కరుస్తున్నాయి.ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, చీమకుర్తి, పొదిలి, మార్కాపురంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్నిచోట్ల ఇళ్లలోకి వర్షపునీరు చేరింది. అనంతపురం జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. కల్యాణదుర్గం వర్షానికి పంట పొలాలు నీటమునిగాయి. శ్రీసత్యసాయి జిల్లాలో కూడా వర్షానికి పలుచోట్ల పంటపొలాలు నీటమునిగాయి. విశాఖపట్నంలోనూ భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు రామకృష్ణాపురం ప్రాంతంలో నీరు ఇళ్లలోకి చేరింది.  భారీ వర్షాల నేపత్యంలో మత్య్సకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. 

click me!