ప్రధాని మోదీ హైదరాబాద్ టూర్.. హైచ్‌ఐసీసీ పరిసరాల్లో కఠిన ఆంక్షలు.. 144 సెక్షన్ విధింపు

By Sumanth KanukulaFirst Published Jun 30, 2022, 9:52 AM IST
Highlights

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. జూలై 2,3 తేదీల్లో ఈ సమావేశాల కోసం మోదీతో కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యనేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. హాజరుకానున్నారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. జూలై 2,3 తేదీల్లో ఈ సమావేశాల కోసం మోదీతో కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యనేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. హాజరుకానున్నారు. అదే సమయంలో జూలై 3వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బీజేపీ బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. బీజీపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న హెచ్‌ఐసీసీ పరిసర ప్రాంతాల్లో  పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ క్రమంలోనే సైబరాబాద్ పోలీసులు జూలై 1 నుంచి 4వ తేదీ వరకు సీఆర్‌పీసీ సెక్షన్ 144ను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడడాన్ని నిషేధించారు.

సమావేశాలు జరగనున్న హెచ్‌ఐసీసీతో పాటు.. ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులు బస చేసే హోటళ్లను భద్రత బలగాలు వారి ఆధీనంలోకి తీసుకున్నాయి. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఇటీవలి నిరసనల దృష్ట్యా సోషల్ మీడియా కార్యకలాపాలపై నిఘా ఉంచారు. హెచ్‌ఐసీసీకి 5 కిలో మీటర్ల పరిధిలో నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. నేటి నుంచి జూలై 3 వరకు నో ఫ్లై జోన్ ఆంక్షలు ఉండనున్నాయి. డ్రోన్లు, పారాగ్లైడింగ్ ఎగరడానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. 

ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో ఎంత సమయం ఉంటారనే విషయం ఇంకా ఖరారు కాలేదు. మోదీ రాజ్‌భవన్‌లోనే బస చేస్తారని తొలుత భావించారు. అయితే రాజ్‌భవన్‌ నుంచి హెచ్‌ఐసీసీ వరకు ప్రధాని రాకపోకలు సాగించడం.. భద్రతా ఏర్పాట్లు సమస్యగా  మారతాయని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో మోదీ నోవాటెల్‌లోనే బస చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. దీంతో ప్రధాని ఎక్కడ బస చేస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక, ప్రధానికి భద్రత కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్.. మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆయన బస చేసే కొన్ని ప్రదేశాలను తనిఖీ చేసింది. ఆదివారం భారీ బహిరంగ సభలో జరగనున్న సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లను కూడా ఎస్పీజీ పరిశీలించింది. 

ఇక, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ మాజీ అధ్యక్షులు, ఇతర పార్టీ నేతలు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులతో సహా దాదాపు 340 మంది బీజేపీ అగ్రనేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్ చుగ్ తెలిపారు. 

click me!