గుత్తా సుఖెందర్ రెడ్డిపై హైకోర్ట్ తీవ్ర ఆగ్రహం

First Published Sep 12, 2017, 12:46 PM IST
Highlights
  • ప్రభుత్వ సలహాదారుల నియామక కేసు ఉపసంహరణకు హైకోర్ట్ నో
  • రాజకీయాలకు న్యాయస్థానాలను వాడుకోవడం సరికాదన్న హైకోర్ట్
  • కేసు విచారణ జరిపి తీరుతామని హెచ్చరిక

కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరిన నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయస్థానాలను వాడుకుంటారా అని తీవ్ర స్వరంతో ప్రశ్నించింది. వివరాలిలా ఉన్నాయి.

గతంలో గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ ఎంపిగా ఉన్న కాలంలో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రమైన పోరాటాలే నడిపారు. ఆయన న్యాయస్థానాల్లో కేసులు వేసి మరీ తెలంగాణ సర్కారుకు ముచ్చెమటలు పట్టించారు. కాలం మారింది. ఆయన టిఆర్ఎస్ గూటికి చేరిపోయారు. దీంతో ఆయన పోరాటాలు ఆగిపోయాయి. సర్కారుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అయితే ఆనాడు ఆయన చేసిన పోరాటాలే ఆయనకు గుదిబండగా మారుతున్నాయి. ఎందుకంటే గతంలో తెలంగాణ సర్కారు ఇబ్బడిముబ్బడిగా ప్రభుత్వ సలహాదారుల కొలువులు ఇచ్చింది. వారికి బుగ్గ కారు, ఫోన్, ప్యూన్ సదుపాయాలు కల్పించింది. చాలా మందికి ఈ అవకాశం కల్పించింది. వారందరికీ కేబినెట్ హోదా కట్టబెట్టింది. దీంతో అప్పట్లో కేసిఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై గుత్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటం చేస్తూ చేస్తూ ఈ అంశంపై హైకోర్టులో కేసు కూడా వేశారు.

అయితే తాజాగా టిఆర్ఎస్ లో గుత్తా చేరిపోవడంతో ఆ కేసును ఉపసంహరించుకోవాలని ఆయన హైకోర్టును కోరారు. అప్పట్లో గుత్తా వేసిన కేసును ఉపసంహరించుకుంటానంటూ హైకోర్టుకు గుత్తా తరుపు న్యాయవాది పిటిషన్ వేశారు. దీంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

న్యాయస్థానాలను రాజకీయాలకు వేదికగా వాడుకుంటున్నారా అని ప్రశ్నించింది హైకోర్టు. మీరు కేసును ఉపసంహరించుకున్నా... కోర్టు విచారణ ఆపబోదని హెచ్చరించింది. కేసు ఉపసంహరణకు హైకోర్టు నో చెప్పింది.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

click me!