కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై రైతుల పిటిషన్‌పై విచారణ.. స్టే ఇచ్చేందుకు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ..

By Sumanth KanukulaFirst Published Jan 11, 2023, 11:50 AM IST
Highlights

కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.

కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అదే సమయంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కామారెడ్డి టౌన్‌ప్లానింగ్ విషయంలో ఇప్పటికిప్పుడు ఏమీకాదని హైకోర్టు పేర్కొంది. హైదరాబాద్, వరంగల్ మాస్టర్ ప్లాన్ విషయంలో ఏళ్ల తరబడి ఊగిసలాట కొనసాగుతుందని వ్యాఖ్యానించింది. అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే దేశం ఎప్పుడో బాగుపడేదని అని అభిప్రాయపడింది. మరోవైపు కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై అభ్యంతరాలు తీసుకుంటామని ఏజీ హైకోర్టుకు తెలిపారు. ఇక, ఇందుకు సంబంధించిన తదుపరి విచారణను ఈ నెల 25కు వాయదా వేసింది. 

ఇక, కామారెడ్డి మున్సిపాలిటీ కోసం రూపొందించిన ముసాయిదా మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ కామారెడ్డి జిల్లాకు చెందిన కొందరు రైతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కామారెడ్డి మండలం రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన 40 మంది రైతులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమను సంప్రదించకుండా రీక్రియేషన్‌ జోన్‌గా ప్రకటించారని రైతులు పిటిషన్‌లో పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్ తమకు నష్టం చేకూర్చే విధంగా ఉందని అన్నారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రభుత్వ స్పందన కోరుతూ నేటికి వాయిదా వేసింది. 

click me!