హైకోర్టులో కేసిఆర్ సర్కారుకు గట్టి షాక్

First Published Apr 17, 2018, 2:03 PM IST
Highlights

కోమటిరెడ్డి, సంపత్ కేసులో సర్కారుకు ఎదురుదెబ్బ

తెలంగాణ సిఎం కేసిఆర్ కు మరో గట్టి షాక్ తగిలింది. మరోసారి హైకోర్టు మొట్టికాయలు వేసింది.  ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టిపారేసింది. వివరాలు చదవండి.

తెలంగాణ అసెంబ్లీలో ఇద్దరు కాంగ్రెస్ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వాలను రద్దు చేశారు. మార్చి 14వ తేదీన స్పీకర్ మధుసూదనాచారి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా వీరిద్దరూ అనుచితంగా ప్రవర్తించారని, అందుకే వారి సభ్యత్వాలను రద్దు చేశామని ప్రభుత్వం చెప్పుకున్నది. అయితే సర్కారుపై ఇద్దరు ఎమ్మెల్యేలు కోర్టులో కేసు వేశారు. తమ సభ్యత్వాలను ఏకపక్షంగా రద్దు చేశారని కోర్టుకు విన్నవించారు. దీంతో అన్ని కోణాల్లో విచారణ జరిపిన న్యాయస్థానం తెలంగాణ సర్కారుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. వారిద్దరి సభ్యత్వాలను రద్దు చేస్తూ వెలువరించిన రాజపత్రాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది.

అంతేకాదు.. వారిద్దరి అసెంబ్లీ సభ్యత్వాలను పునరుద్ధరించాలని ఆదేశించింది. కోమటిరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వాల రద్దు చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. అసెంబ్లీ గెజిట్ నోటిఫికేషన్ రద్దు చేసింది హైకోర్టు.

హైకోర్టు తీర్పుతో తెలంగాణ సర్కారు ఇరకాటంలో పడింది. ఈ కేసులో ఎలాంటి బలమైన ఆధారాలను హైకోర్టుకు సమర్పించలేకపోయింది తెలంగాణ సర్కారు. ఈ కేసు విచారణకు తీసుకున్న తరుణంలో పలు సందర్భాల్లో హైకోర్టులో తెలంగాణ సర్కారు మొట్టికాయలు తిన్న దాఖలాలున్నాయి. అంతేకాదు ఈ కేసు విచారణ సందర్భంగా తెలంగాణ అడ్వొకెట్ జనరల్ దేశాయి ప్రకాష్ రెడ్డి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

తుదకు ఈ కేసులో సర్కారుకు వ్యతిరేకంగా నిర్ణయం వెలువడింది. చరిత్రలో ఇలాంటి తీర్పు రాలేదని పిటిషనర్ తరుపు న్యాయవాది జంధ్యల రవిశంకర్ కామెంట్ చేశారు. ధౌర్జన్యం చేసిన వారికి చెంపపెట్టు అని ఆయన కామెంట్ చేశారు. న్యాయస్థానం 175 పేజీల తీర్పును వెలువరించిందన్నారు. సభ్యత్వ రద్దు అనేది తీవ్రమైన చర్య అని ఆయన అన్నారు. ప్రజల విజయం ఇది అన్నారు.

click me!