తెలంగాణలో భారీ వర్షాలు: ఇళ్లలోకి చేరిన నీరు, రోడ్లపైనే వాహనాలు, ప్రజల ఇబ్బందులు

By narsimha lodeFirst Published Sep 7, 2021, 1:23 PM IST
Highlights

తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో  పలు జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడ వాతావరణ శాఖ హెచ్చరించింది.

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.  దీంతో  రాష్ట్రంలోని 16 జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్షాలు కురుస్తాయని  హెచ్చరికలు చేసింది.

జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, నిర్మల్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, చెరువులు నిండాయి. వరద ప్రవాహం జనవాసాలను ముంచెత్తి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.

సిరిసిల్ల పట్టణం నీట మునిగింది. వరద నీటిలో కార్లు, మోటార్ బైక్ లు కొట్టుకుపోయాయి. ప్రజలు ఇబ్బందిపడవద్దని మంత్రి కేటీఆర్ కోరారు. కరీంనగర్ పట్టణం కూడ నీట మునిగింది. మోకాలిలోతు నీటిలోనే మంత్రి గంగుల కమలాకర్  వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించారు. గంటన్నర లోపుగా వరద నీటిని పంపే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కమలాకర్ చెప్పారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడ భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని పిట్లం బాన్సువాడ మధ్యలో రాంపూర్ వద్ద  వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రవాహంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.మద్నూరు మండలం గోజెగావ్ లోని లెండి వాగుకు వరద పోటెత్తింది. దీంతో వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి.

జగిత్యాలలో లో లెవల్ వంతెన పై నుండి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.జగిత్యాల-ధర్మారం,, జగిత్యాల-ధర్మపురం, జగిత్యాల-పెగడపల్లి  రోడ్లను మూసివేశారు. వరంగల్ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తింది. వర్ధన్నపేటలోని ఆలేరు వాగు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది.హుస్నాబాద్ లోని ప్రధాన రహదారిపై వరద నీరు చేరింది. ప్రధాన వీధులన్నీ నీట మునిగిపోయాయి. 


 

click me!