హైద్రాబాద్ నగరంలో సోమవారం నాడు రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లపైనే వాహనాలు నిలిచిపోయాయి. అవసరం ఉంటేనే రోడ్లపైకి రావాలని జీహెచ్ఎంసీ ప్రజలకు సూచించింది.
హైదరాబాద్: నగరంలో సోమవారం నాడు రాత్రి పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం నీరు రోడ్లపై చేరడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. పలు ప్రాంతాల్లో వాహనాలు రోడ్లపై నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. . ఖైరతాబాద్-పంజాగుట్ట మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరో రెండు గంటల పాటు రోడ్లపై ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
భారీ వర్షం కురవడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. రోడ్లపై నిలిచి ఉన్న వర్షం నీటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. నాంపల్లిలో 9.25 సెం.,మీ. ఆసిఫ్ నగర్ లో 8.63 సెం.మీ. ఖైరతాబాద్ లో 8.35 సెం.మీ. సరూర్ నగర్ లో 7.25 సెం.మీ., రాజేంద్రనగర్ లో 6.43 సెం.మీ, హిమాయత్ నగర్ లో 6.35 సెం.మీ. , అంబర్ పేటలో 6.15 సెం.మీ. , బహదూర్ పురాలో 4.7 సెం.మీ. సికింద్రబాద్ లో 4.45 సెం.మీ. ఉప్పల్ లో 4.3 సెం.మీ. షేక్ పేటలో4.13 సెం.మీ వర్షపాతం నమోదైంది.
undefined
రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లి వద్ద వర్షం నీరు భారీగా చేరింది. ఆరాంఘర్, గగన్ పహాడ్ అండర్ బ్రిడ్జి కిందకు వర్షం నీరు చేరింది. మోకాలిలోతు వర్షం నీరు రోడ్డుపై ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అంబర్ పేట మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద వర్షం నీరు భారీగా చేరింది. అవసరం ఉంటే తప్ప రోడ్లపైకి ఎవరూ రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. రోడ్లపై ట్రాఫిక్ ను పోలీసులు క్లియర్ చేస్తున్నారు.
మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం నాడు కూడ నగరంలో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. నారాయణపేట, మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్ ,కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ.