
గత నాలుగైదు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు, ఎల్లుండి జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించాలని సీఎం కేసీఆర్ సూచించారు.
ఈ క్రమంలో ట్రాఫిక్ జామ్ ఏర్పతుండడంతో సెలవులు ప్రకటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రైవేట్ సంస్థలకు కూడా సెలవులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. అలాగే.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో శుక్రవారం, శనివారం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌ని అనుమతించాలని సీఎం కేసీఆర్ అన్ని IT & ITES కంపెనీలకు ఆదేశాలు జారీ చేశారు.
భారీ వర్షాల కారణంగా రోడ్లపై భారీగా నీళ్లు వచ్చి చేరుతున్నాయి. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి సూచించారు. హైదరాబాద్ నగరంలో గురువారం రాత్రి కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, నగరవాసులు మరీ అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని మేయర్ తెలిపారు.
గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు కాలనీలు నీటమునిగాయి. ఎల్‌బీ నగర్ నియోజకవర్గంలోని నాగోల్ డివిజన్ ఆనంద్ నగర్ సమీపంలోని కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. మోకాళ్ల లోతు నీళ్లు రావడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరవాసులు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఈ వర్షాల కారణంగా వాహనాదారులు కూడా చాలా ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ ఎంసీ ఎమర్జెన్సీ నెం ప్రకటించింది. ప్రమాదంలో పడితే 9000113667 నెంబర్ కు కాల్ చేయండి, హైదరాబాద్ వాసులకు మేయర్ విజ్ఞప్తి చేశారు.