తెలంగాణలో కుండపోత.. పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. మరో రెండు రోజులు భారీ వర్షసూచన

By Sumanth KanukulaFirst Published Sep 11, 2022, 12:31 PM IST
Highlights

తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. గత రెండు రోజుల నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. మరో రెండు రోజులు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది.

తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. గత రెండు రోజుల నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. శనివారం పలుచోట్ల 10 సెం.మీ వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజులు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలుచోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. 

ఈ రోజు ఉదయం నుంచి ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. ఈ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం వరకు కంటిన్యూస్‌గా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 

ఇక, నిన్న ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రానున్న రెండు రోజులు ఆదిలాబాద్‌, కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాలతో చాలా చోట్ల వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. గోదావరి నదికి కూడా వరద ఉధృతి పెరుగుతుంది. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో శనివారం  రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో సిరిసిల్ల పట్ణణంలోని పలు కాలనీలు నీటమునిగాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. నేడు, రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. అందువల్ల ప్రజలు అత్యవసమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. 

click me!