
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి నేడు భేటీ కానున్నారు. ఇందుకోసం కుమారస్వామి శనివారం రాత్రి హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ రోజు కుమారస్వామి ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో సమావేశం కానున్నారు. ఇరువురు నేతల మధ్య జాతీయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ వేదిక కోసం ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్.. బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీల ముఖ్య నేతలతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్ ఆహ్వానం మేరకు కుమారస్వామి హైదరాబాద్‌కు చేరుకున్నారు. కేసీఆర్ దసరా లోపు జాతీయ స్థాయిలో పార్టీని ప్రారంభించే అవకాశం ఉన్నందున.. జాతీయ స్థాయిలో వేదికకు సంబంధించిన అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపే అవకాశం ఉంది.
ఇక, ఈ ఏడాది చివరిలో కర్ణాటకలో అసెంబ్లీ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కుమారస్వామి హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్‌తో భేటీ కానుండటం.. ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక, గతంలో కేసీఆర్ పలు సందర్భాల్లో బెంగళూరు వెళ్లి.. మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారస్వామిలతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.
ఇక, కేంద్రంలోని బీజేపీని గద్దె దించడానికి ప్రత్యామ్నాయ వేదిక కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కేసీఆర్ చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నానని.. ఇందుకు తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కావాలని కోరుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించే ప్రయత్నంలో జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించాలని కేసీఆర్‌ను టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుతున్నారు.
ఇక, సోమ, మంగళవారాల్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను కూడా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని కేసీఆర్‌ను అభ్యర్థించేందుకు ఉపయోగించుకునే అవకాశం ఉంది.