
హైదరాబాద్‌ను భారీ వర్షాలు వీడటం లేదు. మంగళవారం ఉదయం నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలోని పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్, మియాపూర్, పంజాగుట్టు, ఖైరతాబాద్, మెహదీపట్నం, రాజేంద్ర నగర్, అత్తాపూర్, గండీపేట్, నారాయణ గూడ, హిమాయత్ నగర్, శంషాబాద్, పాతబస్తీలలో.. భారీ వర్షం కురిసింది. ఉదయం పూట వర్షం కురవడంతో స్కూళ్లు, కాలేజ్లు, ఆఫీసులకు వెళ్లే వారు చాలా ఇబ్బంది పడుతున్నారు.
మరోవైపు భారీ వర్షంతో పలుచోట్ల రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడుతున్న సమయంలో రోడ్లపై ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షం ఆగిన తర్వాత గంట సేపటికి రోడ్ల మీదకు రావాలని సూచిస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో మరో మూడు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇక, తెలంగాణలో నేడు, రేపు పలుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం నేపథ్యంలో.. ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరవాసులకు కీలక సూచన చేశారు. నగరాని భారీ వర్ష సూచన ఉందనే వాతావరణ శాఖ నివేదికలు సూచిస్తున్నాయని జాయింట్ సీపీ రంగనాథ్ చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు భారీ వర్షం పడే చాన్స్ ఉందన్నారు. ఈ సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం ఆగిన వెంటనే రోడ్లపైకి రావొద్దని కోరారు. వర్షంతో రోడ్లపైకి చేరిన వరదనీరు తొలగడానికి కనీసం గంట సమయమైనా పడుతుందని చెప్పారు. అందుకు అనుగుణంగా వాహనదారులు గంట పాటు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు.