అర్థరాత్రి భారీవర్షం: 100 ఏళ్ల రికార్డును బద్ధలు కొట్టిన హైదరాబాద్

By sivanagaprasad kodatiFirst Published Dec 14, 2018, 1:17 PM IST
Highlights

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్‌లో గత అర్థరాత్రి భారీ వర్షం కురిసింది. గురువారం రాత్రి ఎనిమిది గంటలకు మొదలై శుక్రవారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్‌లో గత అర్థరాత్రి భారీ వర్షం కురిసింది. గురువారం రాత్రి ఎనిమిది గంటలకు మొదలై శుక్రవారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. సికింద్రాబాద్, బేగంపేట్, సనత్ నగర్, అమీర్‌పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎల్‌బీ నగర్, ఉప్పల్ ప్రాంతాల్లో వర్షం కురిసింది.

దీంతో హైదరాబాద్ 100 ఏళ్ల నాటి రికార్డును బద్ధలు కొట్టింది. డిసెంబర్ నెలలో కేవలం 24 గంటల వ్యవధిలోనే 46.6 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదై... డిసెంబర్ 1, 1918 నాడు నమోదైన రికార్డును బ్రేక్ చేసింది. ఆ రోజున హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో కలుపుకుని సుమారు 44.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది.

నాటి నుంచి నేటి వరకు డిసెంబర్ నెలలో ఒక్క రోజులో నమోదైన రికార్డు ఇదే. గురువారం రాత్రి హైదరాబాద్‌కు సమీపంలోని మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలను కలుపుకుని 87.8 మిల్లిమీటర్ల వర్షపాతం కురిసింది.

వీటిలో ఒక్క సంగారెడ్డి జిల్లాలోని కమ్‌కోల్‌తో పాటు మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని బొల్లారంలో 77.5 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షం కారణంగా హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. గరిష్ట ఉష్ణోగ్రత 28.7 సెంటిమీటర్లు కాగా.. కనిష్ట ఉష్ణోగ్రత 18.6గా నమోదయ్యింది.

భారీ వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడంతో పాటు కొన్ని ఏరియాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి ‘‘పెథాయ్’’ తుఫానుగా మారింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

click me!