కేసీఆర్ వ్యూహం ముందు డిఎస్ పల్టీ: నేతల భవిష్యత్తు ఆగం

By Nagaraju TFirst Published Dec 14, 2018, 1:13 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు కొందరికి గుణపాఠం నేర్పాయా....?రాజకీయ ఉద్దండులను ఆగమాగం చేశాయా....?అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక కొందరు భవిష్యత్ ను పాడు చేసుకున్నారా....?తప్పుడు అంచనాలతో తమ రాజకీయ భవిష్యత్ ను చేజేతులా నాశనం చేసుకున్నారా....?అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కొందరు నేతలు అనుసరించిన వ్యూహాలు బెడిసికొట్టడమే అందుకు నిదర్శనమంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. 
 


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు కొందరికి గుణపాఠం నేర్పాయా....?రాజకీయ ఉద్దండులను ఆగమాగం చేశాయా....?అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక కొందరు భవిష్యత్ ను పాడు చేసుకున్నారా....?తప్పుడు అంచనాలతో తమ రాజకీయ భవిష్యత్ ను చేజేతులా నాశనం చేసుకున్నారా....?అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కొందరు నేతలు అనుసరించిన వ్యూహాలు బెడిసికొట్టడమే అందుకు నిదర్శనమంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. 

తెలంగాణ ఎన్నికలకు మందు కేసీఆర్ పై అంచనాలు లేక కొందరు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పగా మరికొందరు కేసీఆర్ పై నమ్మకంతో గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు మాత్రం అదృష్టవంతులు ఎవరో దురదృష్టవంతులు ఎవరో తేల్చేసింది. కేసీఆర్ రాజకీయ పాచిక ముందు సీనియర్ నేతల ప్రణాళికలు బెడిసికొట్టాయి. దీంతో ఫలితాలు వారి అంచనాలను తలకిందులు చెయ్యడంతో రాజకీయ ఉద్దండులు కొందరు బొక్కబోర్లాపడ్డారు. 

కొందరు సీనియర్ నేతలు చేజేతులా తన రాజకీయ భవిష్యత్ ను చీకట్లో నెట్టుకున్న వారిలో ముందువరుసలో ఉన్నారు రాజకీయ కురువృద్ధుడు డి. శ్రీనివాస్. తెలంగాణ ముందస్తు ఎన్నికలకు ముందు డీఎస్ ఒక హైడ్రామా సృష్టించారు అని చెప్పాలి. 

టీఆర్ఎస్ పార్టీని వీడతానని ఒకసారి, కాదు వీడేలా చేస్తున్నారంటూ మరోసారి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతానని ఇంకోసారి ఇలా ఆయన గందరగోళానికి గురవుతూ అభిమానులను కార్యకర్తలను ఆగమాగం చేసేశారు. కానీ ఏపార్టీలో చేరకుండా లోపాయికారి ఒప్పందంతో సరిపెట్టుకున్నారు. 

డీఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి అభ్యర్థి. ఒకసారి సీఎంగా అవకాశం వచ్చినప్పటికీ  రాజశేఖర్ రెడ్డి తన్నుకుపోయారు. దీంతో పీసీస అధ్యక్షుడి హోదాలో చక్రం తిప్పారు. తొమ్మిదేళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజ్యమేలారు. 

అలాంటి డీఎస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ లో చేరిన వెంటనే కేసీఆర్ ఆయన్ను ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ అరుదైన గౌరవం ఇచ్చారు. అంతేకాదు రాజ్యసభకు కూడా పంపారు. అయితే ఆ పార్టీలోనూ డీఎస్ ఇమడలేకపోయారు. 

టీఆర్ఎస్ పార్టీలో తన వర్గానికి అన్యాయం జరగుతుందని పదేపదే ఆరోపించేవారు. తనకు కనీస గౌరవం కూడా దక్కడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో డీఎస్ తన వర్గంతో ప్రత్యేక గ్రూపులు నడపడంతో స్వయంగా పరిశీలిచిన ఎంపీ కవిత తన తండ్రి గులాబీ దళపతి కేసీఆర్ కు ఫిర్యాదు చేసింది. 

అయితే టీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం డీఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ ఎంపీ కవిత నేరుగా సీఎంకే డీఎస్ పై ఫిర్యాదు చేసింది. దీంతో తనను పొమ్మనలేక పొగబెడుతున్నారంటూ డీఎస్ వాపోయారు కూడా. 

ఎంపీ కవిత రాజ్యసభ సభ్యుడు డీఎస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యాలని కోరినా టీఆర్ఎస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటి వరకు డీఎస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యలేదు. 

మెుత్తానికి టీఆర్ఎస్ పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత కల్పించడం లేదని ఆరోపించిన డీఎస్ టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. టీఆర్ఎస్ పార్టీ కూడా ఆయన్ను అంతగా పట్టించుకోలేదు. అయితే ముందస్తు ఎన్నికల్లో డీఎస్ కుప్పిగంతులు వేశారు అని చెప్పుకోవాలి. 

ఎన్నికలకు ముందు డీఎస్ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఢిల్లీలో కలిశారు. అదిగో చేరిపోతున్నా ఇదిగో చేరిపోతున్నా అంటూ లీకులు ఇచ్చారు. రాజ్యసభ పదవిపోతుందనో ఏమో తెలియదు కానీ తన అనుచరగణాన్ని కాంగ్రెస్ లోకి పంపి ఆయన మాత్రం స్తబ్ధుగా ఉండిపోయారు. 

కానీ ఈ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్, అర్బర్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా, కాంగ్రెస్ కు అనుకూలంగా డీఎస్ లోపాయికారిగా పనిచేశారని ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అధికారికంగా డీఎస్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరాలని భావించారు. 

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాజ్యసభ సభ్యుడిగా కానీ, ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందని ఆశపడ్డారు. కానీ ఆయన ఆశలు నెరవేరలేదు. కారు జోరుకు కాంగ్రెస్ పార్టీ కుదేలయ్యింది. కేసీఆర్ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 

తానొకటి తలిస్తే దైవం మరోకటి తలించిందన్నట్లు డీఎస్ అనుకున్నది నెరవేరలేదు. తన అంచనాలు తారుమారుకావడం, కేసీఆర్ మళ్లీ సీఎం కావడంతో డీఎస్ రాజకీయ భవిష్యత్ డోలయమానంలో పడింది. 

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో డీఎస్ కాంగ్రెస్ పార్టీకి లోపాయికారి ఒప్పందంతో పనిచేశారని టీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తోంది. ఈ నేపథ్యంలో డీఎస్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అని జోరుగా చర్చ జరుగుతుంది. డీఎస్ రాజ్యసభకు రాజీనామా చేస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.

ఇకపోతే డిఎస్ అనుచరుడు, ఇదే జిల్లాకు చెందిన భూపతి రెడ్డి చివరి నిమిషంలో టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ టిక్కెట్ సైతం దక్కించుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో భూపతిరెడ్డి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. 

దీంతో భూపతిరెడ్డి పరిస్థితి అయోమయంగా తయారైతంది. అటు టీఆర్ఎస్ పార్టీ భూపతిరెడ్డి సభ్యత్వాన్ని రద్దు చెయ్యాలంటూ శాసనమండలి చైర్మన్ కు ఫిర్యాదు సైతం చేశారు. దీంతో భూపతిరెడ్డి పరిస్థితి రెండింటికి చెడ్డ రేవడిలా తయారైంది. 

అటు కేసీఆర్ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి పోయే..ఇటు ఎన్నికల్లో ఓటమిపాలాయే. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియక భూపతిరెడ్డి గందరగోళానికి గురవుతున్నారు. ఇకపోతే మరో ఎమ్మెల్సీ రాములు నాయక్ దీ అదే పరిస్థితి. 

రాములు నాయక్ కు మెుదటి విడతలో టిక్కెట్ దక్కకపోవడంతో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆఖరి నిమిషంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని టిక్కెట్ దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లోనూ ఆయన ఓడిపోయారు. ఈయన పరిస్థితి కూడా అటు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయారు..ఇటు కేసీఆర్ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిపోతుంది. 

అయితే ఈ ఎమ్మెల్సీలు భూపతిరెడ్డి, రాములు నాయక్ లు డీఎస్ ఆదేశాలతోనే కాంగ్రెస్ లో చేరారని, ఆయన మాట విని ఇలా అడ్డంగా బుక్కైపోయారంటూ ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తమ బాస్ డీఎస్ హవా మళ్లీ వస్తుందని తమకు ఇక తెలంగాణ రాజకీయాల్లో ఎదురే ఉండదని ఆశించారు. కానీ వారి ఆశలను ఆడియాసలు చేస్తూ ఓటరు దేవుడు తీర్పునిచ్చాడు. దీంతో వీరి రాజకీయ భవితవ్యంపైనే చీకటికమ్ముకున్నట్లైంది. 

click me!