వారిని బాగా చూసుకోండి.. నల్గొండలో నర్సింగ్ విద్యార్థినుల బస్సు ప్రమాదంపై హరీష్ రావు ఆదేశాలు..

By Bukka SumabalaFirst Published Dec 12, 2022, 12:44 PM IST
Highlights

నల్గొండ జిల్లాలో జరిగిన నర్సింగ్ కాలేజ్ విద్యార్థినుల ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు స్పందించారు. 

నల్గొండ : జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాద ఘటన పై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పందించారు. నర్సింగ్ కాలేజీ విద్యార్థినుల బస్సు ప్రమాద ఘటనకు సంబంధించిన సమాచారం తెలియగానే ఆయన అధికారులతో మాట్లాడారు. వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాద ఘటనలో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయని వారు తెలిపారు. అయితే వీరంతా ప్రమాదం నుంచి బయటపడ్డారని.. ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యాధికారులు హరీష్ రావుకు వివరించారు. 

గాయపడ్డ విద్యార్థులకు తక్షణమే మంచి, నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. వారందరినీ బాగా చూసుకోవాలని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ కు మంత్రి హరీష్ రావు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఉదయం హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై తాటికల్ సూరారం వైపు వెళ్లే సర్వీస్ రోడ్డులో నర్సింగ్ విద్యార్థుల బస్సు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో  విద్యార్థినులకు గాయాలయ్యాయి. సూర్యాపేట పిజిఎఫ్ నర్సింగ్ కాలేజీ విద్యార్థులు బస్సులో నల్గొండకు వెడుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 

మాండౌస్ ఎఫెక్ట్.. హైదరాబాద్ లో అనేక చోట్ల వర్షాలు.. డిసెంబర్ 14వరకు ఇలాగే...

ఇదిలా ఉండగా, నల్గొండ జిల్లాలో పరీక్ష రాయడానికి వెళ్తున్న నర్సింగ్ విద్యార్థుల బస్సుకు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లాలోని తాటికల్ ఫ్లై ఓవర్ నుండి సర్వీస్ రోడ్డు క్రాస్ అవుతున్న సమయంలో నర్సింగ్ కాలేజీ విద్యార్థుల బస్సును  వెనకవైపు నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో కాలేజీ బస్సు బోల్తా పడింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో సూర్యాపేటకు చెందిన భవాని స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు తీవ్ర గాయాలపాలయ్యారు.  వీరంతా నల్గొండ జిల్లా కేంద్రంలో పరీక్షలు రాయడానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారిని స్థానిక ఆసుపత్రికి తరలించి… చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో  గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దాదాపు 30 మంది గాయపడ్డారు.ఈ ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ మేరకు పోలీసులు ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే డిసెంబర్ 8న చిత్తూరులో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పరిధిలో విషాదం చోటుచేసుకుంది. గత బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహానికి వెళుతుండగా జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పూతలపట్టు, కాణిపాకం మార్గంలోని లక్ష్మయ్య ఊరు అనే ప్రాంతం వద్ద ఈ ఘటన జరిగినట్లుగా  సమాచారం.

click me!