శ్రీనివాస్ శవాన్ని చూసినప్పుడే నిజమైన పండగ: బాధితుల తల్లీదండ్రులు

By Siva KodatiFirst Published Feb 6, 2020, 6:56 PM IST
Highlights

శ్రీనివాస్ రెడ్డిని వారం రోజుల్లోగా ఉరి తీస్తేనే తమ పిల్లల ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు. చనిపోయిన తర్వాతనే తమకు చూపించాలని అప్పుడే తమకు నమ్మకం కలుగుతుందని, మనశ్శాంతి దక్కుతుందన్నారు

ముగ్గురు అమాయక బాలికలపై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసిన శ్రీనివాస్ రెడ్డికి ట్రయల్ కోర్టు ఉరిశిక్ష విధించడంతో హాజీపూర్ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

దీనిపై బాధితుల్లో ఒకరైన శ్రావణి తల్లి మాట్లాడుతూ.. కోర్టుకు, న్యాయవాదులకు, పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. శ్రీనివాస్ రెడ్డిని వారం రోజుల్లోగా ఉరి తీస్తేనే తమ పిల్లల ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు. చనిపోయిన తర్వాతనే తమకు చూపించాలని అప్పుడే తమకు నమ్మకం కలుగుతుందని, మనశ్శాంతి దక్కుతుందన్నారు.

Also Read:హజీపూర్ సీరియల్ రేపిస్ట్, కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి ఉరి శిక్ష

మరో బాధితురాలు కల్పన తల్లి మాట్లాడుతూ.. కోర్టు తీర్పుతో తమకు న్యాయం జరిగిందన్నారు. తీర్పు కోసం 10 నెలల పాటు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

హాజీపూర్ గ్రామ సర్పంచి మాట్లాడుతూ.. తాము పదినెలలుగా తీర్పు కోసం ఎదురుచూశామన్నారు. అతనిని ఉరి తీసినప్పుడే గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంటుందని సర్పంచి తెలిపారు. మనీషా తండ్రి మాట్లాడుతూ.. శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష పడటం వల్ల బలైపోయిన పిల్లలకు న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. 

హజీపూర్ సీరియల్ రేప్, హత్య కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డికి  నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు గురువారం నాడు ఉరి శిక్ష విధించింది. కల్పన కేసులో జీవిత ఖైదు విధించారు. శ్రావణి , మనీషా కేసుల్లో నిందితుడికి మరణశిక్షను విధించారు.శ్రావణి కేసులో స్ట్రాంగ్ సాక్ష్యాధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు

Also Read:నాకేం తెలియదు: కోర్టులో ఏడ్చేసిన హజీపూర్ సీరియల్ రేపిస్ట్ శ్రీనివాస రెడ్డి

గురువారం నాడు మధ్యాహ్నం ఫోక్సో కోర్టు జడ్జి ముందు రాచకొండ పోలీసులు హాజరుపర్చారు.ఈ కేసు గురించి జడ్జి నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని ప్రశ్నించారు. అయితే ఈ కేసులతో తనకు సంబంధం లేదని నిందితుడు శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.తన ఇల్లును కూడ గ్రామస్తులు కూల్చి వేశారని శ్రీనివాస్ రెడ్డి జడ్జికి వివరించారు.  

click me!